: ఇతర ప్రాజెక్టులతో ఇస్రో బిజీ.. దక్షిణాసియా ఉపగ్రహ ప్రయోగం వాయిదా?

ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న దక్షిణాసియా ఉపగ్రహ ప్రాజెక్టు వాయిదే పడే సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ ప్రయోగం ఈ ఏడాది డిసెంబరులోపు ఉంటుందని భావించారు. అయితే ఇతర పనుల్లో ఇస్రో బిజీగా ఉండడంతో ప్రాజెక్టు వాయిదా పడే అవకాశాలు వున్నాయి. డిసెంబరులోనే జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం ఉండడంతో దక్షిణాసియా ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టలేమని ఇస్రో అధికారులు తెలిపారు. జీఎస్ఎల్వీ మార్క్-3 ద్వారా నాలుగు టన్నుల బరువైన ఉగ్రహాలను సైతం రోదసీలోకి పంపే సామర్థ్యం ఇస్రోకు లభిస్తుంది. ప్రస్తుతం 2.2 టన్నుల బరువైన ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించే సామర్థ్యం ఇస్రోకు ఉంది. 2014లో సార్క్ సదస్సులో పాల్గొన్న మోదీ సార్క్ ఉపగ్రహ ప్రాజెక్టు(సార్క్‌శాట్)ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో సమాచార మార్పిడిని మరింత విస్తృతం చేసుకునేందుకు భారత్ ఇస్తున్న కానుకగా దీనిని మోదీ అభివర్ణించారు. సార్క్ శాట్‌ను వ్యతిరేకించిన పాకిస్థాన్ ఈ ఉపగ్రహ నియంత్రణను సార్క్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేసింది. అయిదే దానిని భారత్ సున్నితంగా తోసిపుచ్చింది. ఆ తర్వాత సార్క్ శాట్ పేరును దక్షిణాసియా ఉపగ్రహంగా మార్చారు. ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్ మినహా మిగతా సార్క్ దేశాలన్నీ ఈ ప్రాజెక్టును స్వాగతించాయి. ఈ ఉపగ్రహాన్ని డిసెంబరులో ప్రయోగించాలని తొలుత నిర్ణయించారు. అయితే ఇస్రో బిజీ షెడ్యూల్ కారణంగా ప్రయోగం వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.

More Telugu News