: కివీస్ బౌలర్లను ఆటాడుకున్న కోహ్లీ, ధోనీ.. మూడో వన్డేలో తిరుగులేని విజయం

మొన్న ఢిల్లీలో జరిగిన రెండో వన్డేలో అనూహ్యంగా పరాజయం పాలై కసితో రగిలిపోతున్న టీమిండియా మొహాలీ మ్యాచ్‌లో బదులు తీర్చుకుంది. భారీ లక్ష్యం ముందున్నా ఏమాత్రం తడబాటు లేకుండా పరుగులు సాధిస్తూ విజయ బావుటా ఎగురవేసింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 286 పరుగుల లక్ష్యాన్ని చేతిలో మరో ఏడు వికెట్లు ఉండగానే ఛేదించింది. కోహ్లీ(134 బంతుల్లో 16 ఫోర్లు, సిక్సర్‌తో 154 నాటౌట్), అజేయ శతకంతో ఆకట్టుకోగా అతడికి కెప్టెన్ ధోనీ (91 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 80) పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కివీస్ బౌలర్లలో హెన్రీ రెండు, సౌథీ ఒక వికెట్ పడగొట్టారు. కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 49.4 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌట్ అయింది. టామ్ లాథమ్(61), రాస్ టేలర్(44) రాణించారు. ఓ దశలో 199 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్(47 బంతుల్లో 7 ఫోర్లతో 57), మాట్ హెన్రీ(39 నాటౌట్)లు తొమ్మిదో వికెట్‌కు 84 పరుగులు జోడించి భారీ స్కోరుకు కారణమయ్యారు. భారత బౌలర్లలో కేదార్ జాదవ్, ఉమేష్ యాదవ్ మూడేసి వికెట్లు పడగొట్టారు. బుమ్రా, అమిత్ మిశ్రాలు రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. 287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు అజింక్యా రహానె(5), రోహిత్ శర్మ(13) వెనువెంటనే అవుటవడంతో జట్టు కష్టాల్లో పడినట్టు కనిపించింది. అయితే వైస్ కెప్టెన్ కోహ్లీకి, కెప్టెన్ ధోనీ జత కలవడంతో ఆట స్వరూపం మారిపోయింది. ఇద్దరూ యథేచ్ఛగా షాట్లతో విరుచుకుపడుతూ జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. శాంటర్న్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన ధోనీ వన్డేల్లో 9వేల పరుగుల మైలు రాయిని చేరుకున్నాడు. ఆ తర్వాత మరో రెండు సిక్స్‌లు బాదిన మహీ భారత్ తరపున వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన సచిన్(195) రికార్డును బద్దలు గొట్టాడు. కోహ్లీ, ధోనీలు ఇద్దరూ సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ధోనీ అవుటయ్యాడు. ఆ తర్వాత మిగిలిన పనిని మనీష్ పాండేతో కలిసి కోహ్లీ పూర్తి చేశాడు. 104 బంతుల్లోనే కెరీర్‌లో 26వ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ అదే జోరులో 150 పరుగులు కూడా పూర్తి చేసి కెరీర్‌లో రెండో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. కోహ్లీ దెబ్బకు చేతిలో మరో ఏడు వికెట్లు ఉండగానే భారత్ ఘన విజయం సాధించింది.

More Telugu News