: అత్యధికంగా అమ్ముడైన టాప్-10 వాహనాల్లో ఆరు మారుతి సుజుకివే!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో ఇండియాలో అమ్ముడైన టాప్-10 కార్లలో ఆరు మోడల్స్ మారుతి సుజుకి సంస్థకు చెందినవే ఉండటం విశేషం. దేశంలో అత్యధికంగా కార్లను తయారు చేస్తున్న సంస్థగా నిలిచిన మారుతి సుజుకి ఈ సంవత్సరం అమ్మకాల్లోనూ సత్తా చాటింది. సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్) గణాంకాల ప్రకారం, ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య కాలంలో ఎంట్రీ లెవల్ ఆల్టో బెస్ట్ సెల్లింగ్ మోడల్ గా నిలిచింది. గత సంవత్సరం ఇదే సమయంలోని అమ్మకాలు 1,31,128 యూనిట్లతో పోలిస్తే 7.93 శాతం తక్కువగా 1,20,720 యూనిట్లను మాత్రమే మారుతి సుజుకి విక్రయించినప్పటికీ, ఆల్టో ఆధిపత్యం ఏ మాత్రమూ తగ్గలేదు. మారుతీ గొడుగు కిందనే ఉన్న వాగన్ ఆర్ రెండో స్థానానికి చేరి అమ్మకాలను పెంచుకుంది. 2014-15తో పోలిస్తే ఈ మోడల్ విక్రయాలు 84,660 నుంచి 86,939 యూనిట్లకు పెరిగాయని సియామ్ తెలిపింది. ఇక డిజైర్ మూడవ స్థానంలో నిలిచింది. డిజైర్ మోడల్ అమ్మకాలు ఏకంగా 21 శాతం మేరకు పడిపోయాయి. గత సంవత్సరం 1,03,651 యూనిట్లను అమ్మిన మారుతి సుజుకి ఈ సంవత్సరం 81,926 యూనిట్లకు పరిమితమైంది. నాలుగో స్థానంలో స్విఫ్ట్ నిలిచింది. వీటి కార్ల అమ్మకాలు 1,06,911 యూనిట్ల నుంచి 80,756 యూనిట్లకు తగ్గాయి. టాప్ -10లో ఐదవ స్థానంలో నిలిచిన హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 గత సంవత్సరంతో పోలిస్తే 58,078 నుంచి 71,703 యూనిట్లకు అమ్మకాలను మెరుగుపరచుకుంది. ఆరో స్థానంలో ఎలైట్ ఐ 20, ఆపై రెనాల్ట్ క్విడ్, మారుతి కొత్త మోడల్ బాలెనో, విటారా బ్రెజా, హ్యుందాయ్ క్రెటాలు నిలిచాయి.

More Telugu News