: అప్పుడు బ్రహ్మచారినని వీసా నిరాకరించిన అమెరికా.. తర్వాత రమ్మంటూ పదేళ్ల వీసా ఇచ్చింది.. గతం గుర్తుచేసుకున్న రాందేవ్ బాబా

ఒకప్పుడు తనకు వీసా ఇచ్చేందుకు నిరాకరించిన అమెరికా ఆ తర్వాత పదేళ్ల వీసా ఇచ్చి ఆహ్వానించిందని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమావేశంలో పాల్గొన్న రాందేవ్ బాబా తన తొలి వీసా అనుభవం గురించి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తనకు పెళ్లి కాలేదని, బ్యాంకు ఖాతా కూడా లేదని అమెరికా తనకు వీసా ఇచ్చేందుకు నిరాకరించిందని తెలిపారు. అయితే ఆ తర్వాత న్యూయార్క్‌లో ఓ సభలో ప్రసంగించేందుకు తనను ఆహ్వానిస్తూ పదేళ్ల వీసా మంజూరు చేసిందని రూ.4,500 కోట్ల పతంజలి గ్రూప్‌ సంస్థలకు అధినేత అయిన రాందేవ్ బాబా గుర్తు చేశారు. ‘‘అమెరికా వీసా కోసం దరఖాస్తు చేస్తే ఇచ్చేందుకు నిరాకరించారు. కారణం అడిగితే మీరు బ్రహ్మచారి, బ్యాంకు ఖాతా కూడా లేదని చెప్పారు. మరో నిజం ఏంటంటే నాకు ఇప్పటికీ బ్యాంక్ అకౌంట్ లేదు’’ అని బాబా పేర్కొన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో అనిల్ అంబానీ, గోపీచంద్ హిందూజా, ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తదితరులు పాల్గొన్నారు.

More Telugu News