: 14.5 గంటల్లో 15,300 కిలోమీటర్ల ప్రయాణం... వరల్డ్ లాంగెస్ట్ నాన్ స్టాప్ ఫ్లయిట్... ఎయిర్ ఇండియా రికార్డు

ప్రపంచ దిగ్గజ ఎయిర్ లైన్స్ కంపెనీల వల్లకాని ఘనతను ఎయిర్ ఇండియా సాధించింది. ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు అట్లాంటిక్ మీదుగా కాకుండా, పసిఫిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణించి ప్రపంచంలోనే అత్యధిక దూరాన్ని ఆగకుండా ప్రయాణించిన రికార్డును సొంతం చేసుకుంది. ఈ విమానం 14.5 గంటల్లో 15,300 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించింది. మామూలుగా అట్లాంటిక్ మీదుగా వెళితే పట్టే సమయంతో పోలిస్తే, రెండు గంటల ముందుగానే గమ్యస్థానాన్ని చేరుకుంది. ఈ మార్గంలో విమానం ప్రయాణిస్తున్న దిశలోనే గాలులు వీస్తుండటంతో విమాన వేగం గంటకు వెయ్యి కిలోమీటర్లకు పైగా నమోదు కాగా, సమయం కూడా తగ్గింది. అట్లాంటిక్ సముద్రం మీదుగా ప్రయాణిస్తే, ఎదురుగాలుల కారణంగా విమాన వాస్తవ వేగం తగ్గేదని, ఇప్పుడు ఆ సమస్యను అధిగమించామని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. కాగా, ఇప్పటివరకూ దుబాయ్ నుంచి ఆక్లాండ్ వరకూ 14,120 కిలోమీటర్ల దూరాన్ని ఎమిరేట్స్ విమానం ఆగకుండా ప్రయాణించగా, ఆ రికార్డును ఇప్పుడు ఎయిర్ ఇండియా బ్రేక్ చేసింది. ఈ రికార్డు మరో రెండేళ్ల పాటు చెక్కు చెదరదు. 2018లో సింగపూర్ నుంచి న్యూయార్క్ కు 16,500 కిలోమీటర్ల దూరం నాన్ స్టాప్ గా సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానాలు నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ విమానం నడిచేంత వరకూ వరల్డ్స్ లాంగెస్ట్ నాన్ స్టాప్ ఫ్లయిట్ రికార్డు ఎయిర్ ఇండియాదే.

More Telugu News