: ముద్రణ పూర్తి... త్వరలో చలామణిలోకి రానున్న రూ. '2 వేల నోటు'!

త్వరలోనే మరింత విలువైన కరెన్సీ విడుదల కానుంది. మైసూరులోని ముద్రణా కేంద్రంలో రూ. 2 వేల నోట్ల ముద్రణ పూర్తికాగా, వాటిని చలామణిలోకి విడుదల చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ప్రింట్ అయిన నోట్లను ప్రస్తుతం కరెన్సీ చెస్ట్ లకు తరలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పెరుగుతున్న ధరలను, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని రూ. 2 వేల నోట్లను విడుదల చేయాలని ఆర్బీఐ ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండియాలో రూ. 1000 నోటే అధిక కరెన్సీ నోటుగా ఉండగా, ఈ స్థానాన్ని రూ. 2 వేల నోటు భర్తీ చేయనుంది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం దేశంలో రూ. 16.41 లక్షల కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటిల్లో 86 శాతానికి పైగా నోట్లు రూ. 500, రూ. 1000 వే కావడం గమనార్హం. ఇండియా చరిత్రలో రూ. 10 వేల నోటు అత్యధిక డినామినేషన్ నోటు కాగా, నల్లధనాన్ని అరికట్టే ఉద్దేశంతో 1978లో దీంతో పాటు రూ. 5 వేలు, రూ. 1000 నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం తిరిగి 2000 సంవత్సరంలో రూ. 1000 నోటును విడుదల చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News