: తల్లిదండ్రుల కోరిక మేరకు పాపకు 'వైభవి'గా నామకరణం చేసిన మోదీ!

ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్‌ జిల్లాకు చెందిన భరత్‌ సింగ్‌, విభా దంపతులకు గత ఆగస్టు 13న పాప పుట్టింది. అయితే ఎప్పటి నుంచో తమ బిడ్డకు ప్రధాని మోదీ నామకరణం చేయాలని భావించిన భరత్‌ సింగ్‌ దంపతులు.. చిన్నారి పుట్టిన రోజే ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు. అయితే వూహించని విధంగా.. సరిగ్గా వారం రోజుల తర్వాత ఆగస్టు 20న భరత్‌ సింగ్‌ కు పీఎంవో నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. 'ప్రధాని మీతో మాట్లాడాలనుకుంటున్నారు' అని అవతలి వైపు నుంచి చెప్పగానే.. భరత్‌ సింగ్‌ ఆనందంతో ఉప్పొంగిపోయారు. కొద్ది క్షణాల తర్వాత లైన్లోకి వచ్చిన ప్రధాని మోదీ భరత్‌ తో మాట్లాడి అభినందనలు తెలిపారు. దాదాపు రెండున్నర నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడిన మోదీ.. పుట్టిన పాపకు ఆ దంపతులిద్దరి పేర్లు కలిసేలా ‘వైభవి’ అని పేరు పెట్టారు. ఈ విషయం ఊరిలో వారికి చెబితే అంతా కట్టుకథ అంటూ ఎగతాళి చేశారు. దీంతో వారు తమకు ఏ నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందో ఆ నెంబర్ కు ఫోన్ చేసి, ప్రధాని తమ పాపకు పేరు పెట్టిన విషయాన్ని లేఖ రూపంలో ఇవ్వాలని కోరారు. దీంతో పీఎంవో కార్యాలయం ఆ దంపతులకు లేఖ రాశారు. ఈ లేఖలో 'వైభవి కలలను నిజం చేయడమే మీ పని, ఆమే మీ శక్తి' అని పేర్కొన్నారు. దీంతో ఆ దంపతులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. పీఎంవో నుంచి లేఖ ఆ దంపతులకు అందడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

More Telugu News