: సమాజ్‌వాదీ పార్టీలో చీలిక.. త్వరలో ‘జాతీయ సమాజ్‌వాదీ పార్టీ’ పేరుతో అఖిలేష్ వేరు కుంపటి?

ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీ చీలిక దిశగా అడుగులేస్తోందా? ముఖ్యమంత్రి అఖిలేష్ వేరు కుంపటి పెట్టేందుకు సిద్ధమవుతున్నారా?.. తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆ పార్టీలో సమస్యలు ముదురుతున్నాయి. ముఖ్యమంత్రి అఖిలేష్, ఆయన తండ్రి, ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ మధ్య పొరపొచ్చాలు వచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత దగ్గరైనట్టు కనిపించినా అంతర్గతంగా మాత్రం ఆ వేడి రాజుకుంటూనే ఉంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీకి మెజారిటీ వస్తే ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని ములాయం ప్రకటించడం తండ్రీకొడుకుల మధ్య ఉన్న విభేదాలను మరోమారు బహిర్గతం చేసింది. దీనికితోడు బాబాయ్ శివపాల్ యాదవ్‌తో విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో అఖిలేష్ ఏకంగా కొత్త పార్టీని స్థాపించేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అతి త్వరలో ‘జాతీయ సమాజ్‌వాదీ పార్టీ’ లేదంటే ‘ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ’ పేరుతో ప్రజల ముందుకు వచ్చేందుకు సీఎం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ పార్టీ పేరుతో వచ్చే ఎన్నికల్లో మోటార్ సైకిల్ గుర్తుతో ప్రజల్లోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిన్నమొన్నటి వరకు ఉమ్మడి కుటుంబంగా ఉన్న యాదవ్ ఫ్యామిలీలో ఒక్కసారిగా విభేదాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. దీంతో అఖిలేష్ కుటుంబం నుంచి విడిపోయి సీఎం అధికారిక నివాసానికి మకాం మార్చారు. వచ్చేనెల 5వ తేదీన పార్టీ రజతోత్సవ సంబరాలు నిర్వహించేందుకు పార్టీ సన్నాహాలు చేస్తుండగా, 3వ తేదీ నుంచి అఖిలేష్ ‘వికాస్ రథయాత్ర’ చేపట్టాలని నిర్ణయించి సంచలనానికి తెరలేపారు. అంతేకాక వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు శుక్రవారం ఎస్పీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశానికి అఖిలేష్ గైర్హాజరయ్యారు. దీంతో పార్టీలో చీలిక తప్పదనే సంకేతాలకు మరింత బలం చేకూరినట్టయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే రానున్న ఎన్నికల్లో అఖిలేష్ కొత్త పార్టీతోనే ప్రజల్లోకి వెళ్లనున్నారు.

More Telugu News