: సింహాన్ని ఢీకొన్న అక్కాచెల్లెళ్లు.. పలాయనం చిత్తగించిన మృగరాజు!

ఆడది అబల అన్నదెవరు? మహిళలు దుర్బలురని పేర్కొన్నదెవరు? వారికి గుజరాత్ లో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి చెబితే వెంటనే తమ అభిప్రాయం తప్పు అని కచ్చితంగా ఒప్పుకుంటారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... గిర్‌ అభయారణ్యం సమీపంలోని ఒక కుగ్రామంలో సంతోక్‌ రబరీ (19), మయ్యా (18) అనే అక్కాచెల్లెళ్లు కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు. తండ్రి అనారోగ్యం పాలవడంతో కుటుంబానికి జీవనాధారమైన పశువులను మేపే బాధ్యత కొన్నేళ్లుగా ఈ అక్కాచెల్లెళ్లపై పడింది. దీంతో అక్టోబర్‌ 9న ఎప్పటిలాగే పశువులను మేపడానికి అభయారణ్యానికి వెళ్లారు. కేవలం ఈ అభయారణ్యంలోనే ప్రఖ్యాత ఆసియాటిక్‌ సింహాలు ఉంటాయి. వీరిద్దరూ ఆవులను మేపుతుండగా ఆసియాటిక్ సింహం ఒకటి అక్కడికి వచ్చింది. సాధారణంగా సింహాన్ని చూస్తే ఎవరైనా పారిపోతారు. కానీ ఈ అక్కా చెళ్లెళ్లు తమతో పాటు, తమ ఆవులను కూడా సింహం బారి నుంచి కాపాడుకోవాలని భావించారు. అందుకు ప్రతిగా ప్రాణాలు పోయినా ఫర్వాలేదని నిర్ణయించుకున్నారు. దీంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా, చేతుల్లోని దుడ్డు కర్రలతో సింహానికి ఎదరుగా నిలబడ్డారు. ఏ మాత్రం తొట్రుపడకుండా ఇద్దరూ సింహానికి ఎదరుగా నిలబడ్డారు. అడవికి రాజైన తన ముందు అంత ధైర్యంగా నిలబడ్డ ఆ అక్కాచెల్లెళ్లను చూసిన సింహం ఏమనుకుందో ఏమో కానీ...ఆవులను ఏమీ చేయకుండా వెనుదిరిగి వెళ్లిపోయింది. ఇది తెలిసిన గ్రామస్థులు, అటవీ సంరక్షణాధికారులు వారిద్దర్నీ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా పెద్దమ్మాయి సంతోక్ మాట్లాడుతూ, ‘సింహాలకు వెన్ను చూపిస్తే అవి మనపైన దాడిచేస్తాయి, ధైర్యంగా ముఖాముఖి ఎదురుపడితే ఏం చేయకుండా వెళ్లిపోతాయి’ అని చెప్పింది.

More Telugu News