: కృష్ణన్నా! మొదటినుంచి నాతో పాటు పనిచేశావ్‌.. ఏదైనా పదవి కావాలా?: కేసీఆర్

'కృష్ణన్నా! మొదటినుంచి నాతో పాటు పనిచేశావ్‌.. ఏదైనా పదవి కావాలా?' అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భువనగిరికి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఎలిమినేటి కృష్ణారెడ్డిని ఆప్యాయంగా అడిగిన తీరు ఆసక్తి రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే... యాదాద్రి లక్ష్మీనరసింహుడి సన్నిధిలో పర్యటించిన కేసీఆర్‌ తిరుగుప్రయాణంలో భువనగిరిలోని కృష్ణారెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ సుమారు 30 నిమిషాల పాటు గడిపి వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మరుసటిరోజు మధ్యాహ్నం తనతో భోజనానికి రావాలని ఆయన కృష్ణారెడ్డిని ఆహ్వానించారు. దీంతో కృష్ణారెడ్డి తన కుమారుడు వివేక్‌ రెడ్డిని తీసుకుని మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డితో కలిసి నిన్న మధ్యాహ్నం భోజనానికి సీఎం క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమం తొలి రోజులను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా 'కృష్ణన్నా! మొదటినుంచి నాతో పాటు పనిచేశావ్‌. ఏదైనా పదవి కావాలా?' అని అడిగారు. దీంతో కృష్ణారెడ్డి 'మీ ఇష్టం. మీరు ఏది ఇచ్చినా తీసుకుంటా' అని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది.

More Telugu News