: కొనుగోలు మద్దతుతో 145 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

ఆసియా మార్కెట్ల లాభాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచిన వేళ, సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే 200 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్ సూచిక, ఆపై కూడా అదే జోరును కొనసాగించింది. మధ్యాహ్నం తరువాత కొంత మేరకు అమ్మకాల ఒత్తిడి కనిపించినప్పటికీ, అర శాతానికి పైగా లాభం నమోదైంది. బ్యాంకులు లాభాల్లో పయనించగా, ఐటీ కంపెనీలు నష్టాలను ఎదుర్కొన్నాయి. గురువారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 145.47 పాయింట్లు పెరిగి 0.52 శాతం లాభంతో 28,129.84 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 40.30 పాయింట్లు పెరిగి 0.47 శాతం లాభంతో 8,699.40 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.06 శాతం, స్మాల్ కాప్ 0.50 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 29 కంపెనీలు మాత్రమే లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందాల్కో, ఇన్ ఫ్రాటెల్, ఐడియా తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్, హిందుస్థాన్ యూనీలివర్, సన్ ఫార్మా తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 3,048 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,600 కంపెనీలు లాభాలను, 1,223 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 1,14,00,334 కోట్ల రూపాయలకు పెరిగింది.

More Telugu News