: ఆ 39 మందికి రూ. 16.5 కోట్లు చెల్లించండి!: 'యునిటెక్'కు సుప్రీం ఆదేశం

సరైన సమయంలో అపార్టుమెంట్లను అప్పగించకుండా కాలయాపన చేసిన నిర్మాణ రంగ దిగ్గజం యునిటెక్, 39 మంది కొనుగోలుదారులకు రూ. 16.55 కోట్లను తిరిగి చెల్లించాల్సిందేనని న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, అమితవరాయ్, ఏఎం ఖాన్విల్కర్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. గుర్ గాంలో యునిటెక్ చేపట్టిన 'విస్తా ప్రాజెక్టు'లో ఏడేళ్ల క్రితం వీరంతా ఫ్లాట్లు బుక్ చేసుకోగా, ఇంతవరకూ వాటిని హ్యాండోవర్ చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కస్టమర్లకు ఎంత మేరకు వడ్డీ ఇవ్వాలన్న విషయంతో పాటు, వారికి నష్టపరిహారంపై జనవరి రెండో వారంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. విస్తా ప్రాజెక్టులో మొత్తం 1200 మంది పెట్టుబడిదారులు ఉన్నారని, వారంతా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే, తమ పరిస్థితి ఏంటని యునిటెక్ ప్రశ్నించగా, తమ తీర్పు ముందుగా వచ్చిన 39 మందికి మాత్రమే వర్తిస్తుందని, ఇప్పుడు ఎవరు ఇదే తరహా పిటిషన్ వేసినా స్వీకరించబోమని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణం వేగంగా సాగుతోందని, వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి డెలివరీ మొదలవుతుందని యునిటెక్ కోర్టుకు తెలిపింది. ఇప్పటికే రూ. 15 కోట్లను యునిటెక్ సంస్థ కోర్టులో డిపాజిట్ చేసి వున్నందున, మరో రూ. 2 కోట్లు దానికి జత చేయాలని, పిటిషనర్లకు తామే పంచుతామని ధర్మాసనం పేర్కొంది. కాగా, పార్శ్వనాథ్ డెవలపర్ సంస్థపైనా ఇదే తరహా పిటిషన్లు దాఖలు కాగా, అనుకున్న సమయానికి ప్లాట్లను అందించనందుకు 70 మందికి వారి డబ్బును వడ్డీతో సహా వెనక్కిచ్చేయాలని కోర్టు తీర్పిచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News