: దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ‘ఏకాకి’... ఆ పార్టీ వ్యాఖ్యలను ప్రజలు పరిగణనలోకి తీసుకోరు: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు

పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో శిబిరాలు ఏర్పాటు చేసుకొని ఉన్న ఉగ్ర‌వాదుల‌పై భారతసైన్యం ఇటీవల చేసిన స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ ప‌ట్ల‌ భారతీయులు హర్షం వ్య‌క్తం చేస్తోంటే, మ‌రోవైపు కాంగ్రెస్ నేత‌లు ఆవేదన ఎందుకు చెందుతున్నార‌ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్ర‌శ్నించారు. ఈ విష‌యం త‌న‌కు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఈ రోజు హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన‌ మీడియా స‌మావేశంలో ఆయ‌న‌ మాట్లాడుతూ.. స‌ర్జిక‌ల్ దాడుల‌ను త‌మ పార్టీ రాజకీయంగా వాడుకుంటుందని ప్ర‌తిప‌క్షం చేస్తోన్న ఆరోపణలను తాము ఖండిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. భార‌త‌ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వారి వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని లక్ష్మణ్ అన్నారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని ఏకాకిగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఆ పార్టీ నేత‌ల వ్యాఖ్యలను ప్రజలు పరిగణనలోకి తీసుకోరని వ్యాఖ్యానించారు. కేంద్ర స‌ర్కారు దౌత్యపరంగా పాకిస్థాన్‌ను ఏకాకిని చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుపుతుంటే, కాంగ్రెసే స‌ర్జిక‌ల్ దాడుల‌పై ఇటువంటి వ్యాఖ్య‌లు చేస్తూ రాజకీయం చేస్తోందని ఆయ‌న అన్నారు.

More Telugu News