: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉగ్రసంస్థ ఐఎస్ఐఎస్

ప్రపంచంలోని అనేక దేశాల్లో రక్తపుటేరులు పారిస్తున్న ఉగ్రసంస్థ ఐఎస్ఐఎస్ ను ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. ఓ వైపు తాను ఆక్రమించుకున్న భూభాగం సంకీర్ణసేనల దాడులతో తరిగిపోతుంటే... మరోవైపు నుంచి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతానికైతే సిరియా, ఇరాక్ లలోని సహజ వనరులు, తమ పట్టు ఉన్న ప్రాంతాల్లో పన్నులు విధించడం ద్వారానే ఐఎస్ కు ఆదాయం సమకూరుతోంది. తాజాగా, తన అధీనంలో ఉన్న మోసుల్ (ఇరాక్) పట్టణాన్ని చేజిక్కించుకోవడానికి ఇరాకీ సేనలు సంకీర్ణ బలగాలతో కలసి యుద్ధం మొదలుపెట్టడంతో ఐసిస్ కష్టాలు మరింత పెరిగాయి. ఆదాయం గణనీయంగా పడిపోవడం మొదలైంది. బలవంతపు వసూళ్లు, పన్నుల ద్వారా 2015లో ఐఎస్ కు నెలకు 30 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరేది. ఒక్క మోసుల్ నగరం నుంచే నెలకు 4 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చేది. దీనికి తోడు, బ్యాంకులను కొల్లగొట్టడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేది. మోసుల్ ని ఆక్రమించిన కొత్తలో అక్కడ ప్రభుత్వ బ్యాంకులను దోపిడీ చేసి ఒకేసారి 500 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో తన ఫైటర్స్ కి జీతాలు ఇవ్వడానికి కూడా ఐఎస్ ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే ఐఎస్ ఫైటర్ల వేతనాలు సగానికి సగం తగ్గిపోయాయట.

More Telugu News