: పాకిస్థాన్ లో మూలమూలకూ వెళ్లేలా... బ్రహ్మోస్ సామర్థ్యం రెట్టింపు చేస్తాం: పుతిన్

పాకిస్థాన్ భూభాగంలోని ప్రతి అంగుళాన్ని తాకేలా బ్రహ్మోస్ క్షిపణి సామర్థ్యం రెట్టింపు కానుంది. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో యుద్ధం ఏర్పడితే, బహుళ ప్రయోజనకారిగా అటు అణు జలాంతర్గాముల నుంచి, ఇటు ఉపరితలం, వాయు మార్గాల్లో ప్రయోగించేందుకు వీలుగా బ్రహ్మోస్ కెపాసిటీని మరింత బలోపేతం చేసే దిశగా రష్యాతో ఇండియా డీల్ కుదుర్చుకుంది. ఇరు దేశాల మధ్య డీల్ కుదిరిన విషయం తప్ప, మరిన్ని వివరాలు వెల్లడికాలేదు. 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను బ్రహ్మోస్ అత్యంత కచ్చితత్వంతో ఛేదించేలా అభివృద్ధి చేయడానికి భారత్‌, రష్యా అంగీకరించినట్టు తాజాగా వెల్లడైంది. ఈ క్రూయిజ్‌ క్షిపణులు భారత్‌ కు అత్యంత కీలకంగా మారగా, ఈ సంవత్సరం జూన్ లో క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థ (ఎంటీసీఆర్‌) లో ఇండియా భాగస్వామిగా చేరిన తరువాత అత్యాధునిక బ్రహ్మోస్‌ క్షిపణుల ఉత్పత్తికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఇండియా వద్ద ఉన్న ఈ క్షిపణుల సామర్థ్యం 300 కిలోమీటర్లు కాగా, వీటిని ప్రయోగిస్తే, పాకిస్థాన్ లోని అన్ని ప్రాంతాలనూ చేరుకోలేవు. మరింత ఎక్కువ సామర్థ్యం ఉన్న ఖండాంతర క్షిపణులు భారత్ వద్ద ఉన్నప్పటికీ, అవి బ్రహ్మోస్‌ కు సాటిరావు. అందువల్లే పాక్‌ తో యుద్ధం సంభవిస్తే ఈ క్షిపణులు అత్యంత కీలకం కానున్నాయి. ఇక బ్రిక్స్ సమావేశాల అనంతరం రష్యా వెళ్లిన పుతిన్, డీల్ గురించిన పూర్తి వివరాలు వెల్లడించకుండా, బ్రహ్మోస్‌ క్షిపణి సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికీ డీల్ కుదుర్చుకున్నామని, నేల, నీరు, వాయు మార్గాల ద్వారా వాటిని ప్రయోగించేలా సహాయపడనున్నామని మీడియాకు వెల్లడించారు.

More Telugu News