: ఒకరిది ఆరాటం... మరొకరిది పోరాటం... నేడే రెండో వన్డే

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు రెండో వన్డే జరగనుంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో రెండు జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో విజయం సాధించి వన్డేల్లో టీమిండియాకు తమ సత్తాచూపి సిరీస్ లో పోరాటంలోకి రావాలని న్యూజిలాండ్ ఆటగాళ్లు భావిస్తుండగా, ఈ మ్యాచ్ లో నెగ్గి సిరీస్ లో ఆధిపత్యం, తద్వారా వన్డేల్లో అగ్రస్థానం సాధించాలని టీమిండియా కెప్టెన్ ధోనీ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ రెండు జట్లకు కీలకం కానుంది. ఫిరోజ్ షా కోట్ల మైదానం బ్యాటింగ్ పిచ్ అన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో పిచ్ మందకొడిగా ఉంటుంది. దీంతో స్లో, స్వింగ్ బౌలర్లకు ఈ పిచ్ స్వర్గధామం. చలికాలం మొదలైపోయి ఢిల్లీలో అప్పుడే మంచు కురుస్తోంది. ఇది లక్ష్య ఛేదనకు సానుకూలంగా ఉంటుంది. బంతిపై బౌలర్ పట్టుకోల్పోతాడు. ఫీల్డర్లు కూడా క్యాచ్ లు జారవిడిచే అవకాశం ఉంటుంది. దీంతో టాస్ గెలిచిన జట్టు లక్ష్యఛేదనకే మొగ్గు చూపుతుంది. మరోవైపు టెస్టుల్లో వైట్ వాష్ అయిన న్యూజిలాండ్ జట్టు ఈ మ్యాచ్ లో ఎలాగైనా నెగ్గాలన్న లక్ష్యంతో ఉంది. అయితే వన్డేల్లో దూకుడైన ఓపెనర్ గా ఉన్న గప్టిల్ ఫాం కివీస్ ను ఆందోళనకు గురిచేస్తోంది. టీమిండియాపై మంచి ట్రాక్ రికార్డు ఉన్న రాస్ టేలర్ కూడా టీమిండియా బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతుండడం ఆ జట్టుకు ప్రతికూలంగా మారింది. దీనికి తోడు టీమిండియా పేసర్లు రాణిస్తున్న వేళ వరల్డ్ క్లాస్ బౌలర్ అయిన టిమ్ సౌతీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడం ఆ జట్టును ఓటమిపాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గప్టిల్, రాస్ టేలర్ కు బదులుగా కొత్త ఆటగాళ్లను బరిలోకి దించాలని విలియమ్సన్ భావిస్తున్నాడు. మరోవైపు జ్వరంతో బాధపడుతున్న రైనా రెండో వన్డేలో కూడా దిగే అవకాశం లేకపోవడంతో తొలి వన్డేలో ఆడిన జట్టునే ధోనీ కొనసాగించనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News