: భారత్ లో నెంబర్ వన్ స్థానం సాధించడమే లక్ష్యం...ఐదేళ్లు చాలంటున్న చైనా మొబైల్ ఫోన్ సంస్థ

భారత్ లోని సోషల్ మీడియాలో చైనా వస్తువులను బ్యాన్ చేయాలంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ప్రచారం జరుగితేనే భారత్ లో అమ్మకాలు పెరుగుతాయని చైనా విశ్వాసం వ్యక్తం చేస్తోన్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెలలో కేవలం 18 రోజుల్లోనే పది లక్షల స్మార్ట్‌ ఫోన్లు విక్రయించి షియోమీ రికార్డు సృష్టించింది. భారత్‌ లో రానున్న మూడు నుంచి ఐదేళ్లలో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే తమ లక్ష్యమని చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ షియోమీ గ్లోబల్ సీఈవో లీ జున్ తెలిపారు. భారత్ తమకు ప్రధాన మార్కెట్ అన్న ఆయన భారత్ మార్కెట్ కారణంగా షియోమీ పేరు ప్రపంచ వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందని తెలిపారు. ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌ కార్ట్, స్నాప్‌ డీల్ ద్వారా ఈ నెల మొదట్లో లక్షలాది ఫోన్లను విక్రయించిన షియోమీ, దీపావళి ఆఫర్ల పేరుతో మరోసారి మరింత మార్కెట్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్నాప్‌ డీల్ ఫెస్టివ్ ఆఫర్ సేల్‌ ను నేడు ప్రారంభించగా, ఫ్లిప్‌ కార్ట్, అమెజాన్ కూడా అదే బాటలో నడిచాయి. ఆగస్టు 2015 నుంచి సెప్టెంబరు 2016 వరకు షియోమీ ఇండియాలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో గణనీయమైన వాటాను సాధించడం ద్వారా ఎన్నో మైలు రాళ్లు అధిగమించిందని ఆయన తెలిపారు. గత ఏడాది ఒక్క నెల రోజుల్లో ఐదు లక్షల ఫోన్లు విక్రయించి మార్కెట్ లో గణనీయమైన వాటా సాధించుకుంది. గత ఆరు నెలల్లో 20 లక్షలకుపైగా ఫోన్లు విక్రయించినట్టు తెలిపింది.

More Telugu News