: సత్యవతి చేసిన తప్పేంటి... ప్రశ్నిస్తే జైల్లో పెడతారా?: తణుకులో జగన్

కాలుష్యాన్ని అరికట్టమని కోరితే హత్యాయత్నం కేసులు పెడతారా? అని వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీని వ్యతిరేకించిన ఏడుగురిపై హత్యాయత్నం కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు సబ్ జైల్లో ఉన్న సత్యవతిని ఈ రోజు ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం పెరిగిపోతుందని ప్రజలు వాపోతున్నా పట్టించుకోరా? అని టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే డెల్డా పేపర్ మిల్లుతో ఇక్కడి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వారికి కావాల్సినవారికి మేలు చేయడానికి ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తోందని మండిపడ్డారు. ఫ్యాక్టరీ వేస్ట్ పోవడానికి పైప్ లైన్ నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతోందని... ఈ ఖర్చును ఎవరు భరిస్తారని జగన్ నిలదీశారు. ఒకవేళ పైప్ లైన్ లీకేజీ ఏర్పడితే రైతులకు చాలా నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సముద్ర తీరంలో గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ కి 350 ఎకరాల భూమి ఉన్నట్టు తెలుస్తోందని... ఈ ఫ్యాక్టరీని అక్కడ పెడితే, తాము కూడా సహకరిస్తామని చెప్పారు.

More Telugu News