: చ‌నిపోయిన తరువాత కూడా ఆయ‌ననే దేవుడిగా పూజిస్తున్నారు: సాయిబాబాపై మరోసారి తీవ్రవ్యాఖ్యలు చేసిన స‌్వ‌రూపానంద స్వామి

ద్వారకా పీఠాధిపతులు శ్రీ స్వరూపానంద మ‌రోసారి షిర్డీ సాయిబాబాపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కోట్లాది మంది దైవంగా కొలుచుకునే సాయిబాబాపై ఆయ‌న ఇటీవ‌ల అనంత‌పురంలో ప‌లు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ స‌మ‌యంలో సాయి భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో ఆయ‌నపై విరుచుకుప‌డ్డారు. దీనిపై మ‌రోసారి స్పందించిన‌ స్వ‌రూపానంద ఈ రోజు ప్ర‌కాశం జిల్లా ఒంగోలులో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి మ‌రీ త‌న వ్యాఖ్య‌ల‌పై మ‌రింత స్ప‌ష్ట‌త ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. శాస్త్ర ప్ర‌మాణాలు లేకుండా ప్ర‌జ‌లు సాయిబాబాను పూజిస్తున్నార‌ని స్వరూపానంద సరస్వతి అన్నారు. సాయిబాబా అస‌లు పేరు చాంద్‌మియా అని, ఆయ‌న‌ చ‌నిపోయిన తరువాత కూడా ఆయ‌ననే దేవుడిగా పూజిస్తున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు. సాయిని త్రిమూర్తులుగా కొలుస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చ‌నిపోయిన వ్య‌క్తిని పూజించ‌డాన్ని గురించి రామ్‌చ‌రిత్ మాన‌స్‌లో త‌ప్పుబ‌ట్టారని ఆయ‌న చెప్పారు. ప్ర‌జ‌లు విష్ణుమూర్తిని పూజించ‌వచ్చు.. కానీ, సాయిబాబాను కాదని ఆయ‌న అన్నారు. చ‌నిపోయిన చాంద్‌మియాను విష్ణువుగా ఎలా పూజిస్తారని ప్ర‌శ్నించారు. కృష్ణుడి స్థానంలో పిల్ల‌న‌గ్రోవిని ప‌ట్టుకున్న సాయిని ఎలా కొలుస్తారు? అంటూ ప్ర‌శ్నించారు. త‌మ వ్యాఖ్య‌ల ప‌ట్ల‌ విభేదించేవారు.. ఈ అంశంపై కూర్చొని చర్చించ‌వ‌చ్చని.. కానీ, గొడ‌వ‌లు ఎందుకు చేస్తారని ఆయన ప్ర‌శ్నించారు.

More Telugu News