: నియంత్రణ రేఖను గతంలోనూ దాటాం.. కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం వేరు: పార్లమెంటరీ ప్యానల్‌కు స్పష్టం చేసిన కేంద్రం

లక్ష్య ఛేదనకు ఆర్మీ గతంలోనూ నియంత్రణ రేఖను దాటిందని, అయితే సెప్టెంబరు 29న జరిగిన ఘటన ఇందుకు పూర్తి భిన్నమని పార్లమెంటరీ ప్యానల్‌కు మంగళవారం ప్రభుత్వం స్పష్టం చేసింది. గతనెలలో మొదటిసారిగా పాక్ భూభాగంలో ఆర్మీ అడుగుపెట్టి ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిందని పేర్కొంది. గతంలో ఆర్మీ ఎల్‌వోసీ దాటినా ఆ విషయాన్ని బయటపెట్టలేదని తెలిపింది. ప్యానల్‌లోని కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు సత్యవ్రత్ చతుర్వేది అడిగిన ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ ఈ విషయాలను వెల్లడించారు. ఉరీ ఉగ్రదాడి తర్వాత పీవోకేలో భారత్ ఆర్మీ సర్జికల్ దాడులు నిర్వహించిందని జైశంకర్ పేర్కొన్నారు. గతంలో ఎల్‌వోసీ వెంబడి ఆర్మీ దాడులు చేసినప్పటికీ గత నెలలో సర్జికల్ దాడుల నిర్వహించాల్సి వచ్చిన పరిస్థితులు వేరని ఆయన తెలిపారు. ‘‘గతంలోనూ ఆర్మీ ఎల్‌వోసీని దాటిందా? అంటే అవును అనే చెబుతా. అయితే అప్పట్లో ఎల్‌వోసీ వెంబడి ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసేందుకే ఆర్మీ నియంత్రణ రేఖ దాటిందా అంటే మాత్రం కాదని చెబుతా’’ అని జైశంకర్ పేర్కొన్నట్టు కమిటీ తెలిపింది.

More Telugu News