: పోన్లే.. అంటే మీరు మునిగి.. నన్నూ ముంచుతారు: చంద్రబాబు

తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన పార్టీ, మంత్రివర్గ సమన్వయ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పనితీరు సరిగా లేకపోయినా పోన్లే.. అని ఓ పదిమందికి సీట్లిస్తే ఆ కారణంగా మరో 10 సీట్లు పోతాయని అన్నారు. మీరు మునిగి నన్నూ ముంచే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో తనకు తెలుసన్న చంద్రబాబు, తప్పులు దిద్దుకోవడానికి సమయం ఇస్తానని, మెరుగుపరుచుకోకపోతే మాత్రం ప్రత్యామ్నాయం తప్పదని హెచ్చరించారు. ప్రవర్తన, పనితీరు మార్చుకోవాల్సిన వారు ఆ పని వెంటనే చేయాలని సూచించారు. ఇసుక దందాలు చేస్తున్నవారు, నకిలీ విత్తన కంపెనీలు, బయో పెస్టిసైడ్స్ పేరుతో మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో నా వారు, పైవారు అనే భేదాలు ఉండబోవని తేల్చి చెప్పారు. సొంతపార్టీ వారు దందాలు చేసినా విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మునిసిపల్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ప్రతిపక్షానికి పోవడానికి లేదని పార్టీ నేతలకు బాబు సూచించారు. అలాగే శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాలు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించాల్సిందేనని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లు ఎంతో కష్టపడ్డామని, ఇకపై పార్టీని బలోపేతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చంద్రబాబు పేర్కొన్నారు. ముద్రగడ పాదయాత్ర గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం పేర్కొన్నారు.

More Telugu News