: వైభవంగా ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడితల్లమ్మ సిరిమానోత్సవం

ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం విజయనగరంలో వైభవంగా జరుగుతోంది. ఆలయ వడ్రంగుల ఇల్లు హుకుంపేట నుంచి సిరిమాను 2 గంటలకు చదురుగుడికి చేరుకుంది. అక్కడ సిరిమానును అధిరోహించిన ఆలయ పూజారి భాస్కరరావు మూడు లాంతర్ల జంక్షన్ నుంచి కోట వరకు మూడు సార్లు ప్రదక్షిణ చేస్తారు. ఈ నేపథ్యంలో కోటపై నుంచి కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు కుటుంబం, మంత్రి కిమిడి మృణాళిని కుటుంబ సభ్యులు సిరిమానును వీక్షించారు. కాగా, సిరిమాను పైకి అరటి పండ్లు విసిరి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు చదురుగుడి, వనంగుడికి భక్తులు పోటెత్తారు. సిరిమానోత్సవానికి సుమారు 3 లక్షల మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా 3 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

More Telugu News