: మొత్తం ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినా మా పోరాటం ఆగదు: వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి

తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇవ్వడంపై ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి స్పందించారు. తమ ఎమ్మెల్యేలు ఏం నేరం చేశారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన ప్రత్యేకహోదా కోసం సభను స్తంభింపజేయడమే తాము చేసిన నేరమా? అని అడిగారు. 12 మంది ఎమ్మెల్యేలనే కాదు... మొత్తం ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసినా, తమ పోరాటం ఆగదని అన్నారు. వైసీపీ తరపున గెలిచి, టీడీపీలో చేరిపోయిన ప్రజాప్రతినిధులను అనర్హులుగా ప్రకటించాలని తాము కోరుతున్నా, ఇంతవరకు ఎలాంటి స్పందన లేదని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రివిలేజ్ కమిటీలో జ్యోతుల నెహ్రూ స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించామని... అయినప్పటికీ, నెహ్రూనే కొనసాగిస్తున్నారని ఆయనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపిస్తుంటే, ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి పదవి కోసమే తమ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ లేనిపోని నిందలు వేస్తున్నారని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో రైతుల కష్టాలు, ఆత్మహత్యలపై స్పందించే తీరిక కూడా పయ్యావులకు లేదా? అని ప్రశ్నించారు.

More Telugu News