: క్షమాపణలు కోరిన ప్రియాంక చోప్రా

బాలీవుడ్ నటి, క్వాంటికో సిరీస్ స్టార్ ప్రియాంక చోప్రా క్షమాపణలు చెప్పింది. 'కోండే నాస్ట్ ట్రావెలర్' మేగజీన్ కవర్ పేజీపై తాను ధరించిన టీషర్ట్ కు సంబంధించి సారీ చెప్పింది. కవర్ పేజీపై ప్రియాంక ధరించిన వైట్ టీషర్ట్ పై రెఫ్యూజీ(శరణార్థి), ఇమ్మిగ్రెంట్ (వలసవాది), ఔట్ సైడర్ (బయటి వాడు), ట్రావెలర్ (ప్రయాణికుడు) అనే పదాలు ఓ బాక్స్ లో ఉన్నాయి. వీటిలో రెఫ్యూజీ, ఇమ్మిగ్రెంట్, ఔట్ సైడర్ అనే పదాలను కొట్టివేసి... ట్రావెలర్ అనే పదం మాత్రం వదిలివేసి ఉంది. దీనిపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిసింది. శరణార్థులంటే అంత చిన్నచూపా? అంటూ ప్రియాంకపై నెటిజన్లు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో, ఈ క్వాంటికో భామ క్షమాపణలు కోరింది. మీ మనోభావాలను గాయపరిచినందుకు క్షమాపణలు కోరుతున్నానని తెలిపింది. మేగజీన్ వాళ్లే ఈ టీషర్ట్ తెప్పించారని, తనను వారే వేసుకోమన్నారని చెప్పింది. ప్రజల్లో నెలకొన్న 'జెనోఫోబియా'ను గుర్తించడానికి ఈ టీషర్ట్ ధరించాలని కోరారని తెలిపింది. మంచి చేయాలనే ఉద్దేశంతోనే మేగజీన్ యాజమాన్యం ఈ పని చేసిందని... ఎవరినీ కించపరచాలనే ఉద్దేశంతో కాదని చెప్పింది. యుద్ధ భయం, పేదరికం, హింస తదితర కారణాల నేపథ్యంలో, గత ఏడాది దాదాపు 13 లక్షల మంది శరణార్థులు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాల నుంచి యూరప్ కు తరలివెళ్లారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అతిపెద్ద శరణార్థుల సంక్షోభం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, దేశాలు దాటి వెళ్లే క్రమంలో కొన్ని వేల మంది అభాగ్యులు సముద్రంలో మునిగిపోయి, ప్రాణాలు వదిలారు.

More Telugu News