: ‘నేను దళితుడిని.. మాది గుంటూరు’.. అన్న రోహిత్ వేముల పాత వీడియో బయటకు.. ఆయన దళితుడు కాదని తేల్చిన వారంలోనే బయటకొచ్చిన వీడియో

ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల దళితుడు కాదని గతవారం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సోమవారం రోహిత్ గతంలో మాట్లాడినట్టుగా చెబుతున్న వీడియో ఒకటి బయటపడి కలకలం రేపుతోంది. ఆ వీడియోలో రోహిత్ ‘‘అందరికీ జై భీమ్. నా పేరు రోహిత్ వేముల. నేను దళితుడిని. మాది గుంటూరు. 2010 నుంచి హైదరాబాద్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా. సోషల్ సైన్స్ డిపార్ట్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడు. జనవరి 17న రోహిత్ ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను చిత్రీకరించినట్టు తెలుస్తోంది. రోహిత్ దళితుడా? కాదా? అన్న విషయంపై ఇటు పోలీసులు, అటు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ అధికారులు గత పదినెలలుగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోను సాక్ష్యంగా పరిగణించాలని రోహిత్ స్నేహితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తాజాగా బయటపడిన వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసేందుకు షూట్ చేసినట్టు తెలుస్తోంది.

More Telugu News