: భారత్-పాక్‌ల మధ్య ఆగని మాటల యుద్ధం.. పరస్పర ఆరోపణలతో రెచ్చిపోతున్న దాయాదులు

భారత్ సర్జికల్ దాడుల తర్వాత దాయాదుల మధ్య మొదలైన మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాలు పరస్పరం ఆరోపణల తూటాలు పేలుస్తూ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామమని, వారిని పెంచి పోషిస్తోందని భారత్ ఆరోపిస్తుండగా, కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ తూట్లు పొడుస్తోందని, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 90 సార్లు భారత్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని పాక్ ఆరోపిస్తోంది. మరోవైపు పాక్ స్వయం కృతాపరాధంతోనే అంతర్జాతీయంగా ఏకాకిగా మారిందని భారత విదేశాంగ అధికార ప్రతినిధి వికాశ్ స్వరూప్ పేర్కొన్నారు. ఎవరైనా ఒంటరిగా మారారంటే దానికి కారణం ఆ దేశం అనుసరించే విధానాలే కారణమన్నారు. దాంతో భారత్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పదమూడేళ్ల నాటి కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ తూట్లు పొడుస్తోందని, 2016లో ఇప్పటి వరకు 90 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని పాక్ ఆరోపించింది. ఇప్పటికైనా భారత్ దీనికి పుల్‌స్టాప్ పెడితే మంచిదని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జక్రియా సూచించారు. ప్రాంతీయ శాంతికి భారతదేశమే ప్రధాన అడ్డంకి అని ధ్వజమెత్తారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఏనాడూ ఉల్లంఘించలేదని, పాక్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు భారత్ అర్థం లేదని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.

More Telugu News