: పాక్ ప్రభుత్వం, మీడియా మధ్య తీవ్రతరమైన యుద్ధం... నిప్పులు చెరిగిన 'ది నేషన్' పత్రిక

పాకిస్థాన్ లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం, మీడియా మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రతరమైంది. ఇప్పటికే పాక్ ప్రభుత్వం, ఆర్మీల మధ్య బలహీనమవుతున్న సంబంధాలకు సంబంధించి 'ది డాన్' పత్రిక రాసిన కథనాలు సంచలనం రేకెత్తించాయి. పాక్ ప్రభుత్వం, ఆర్మీలకు ఇంతకాలం గొంతుకగా నిలిచిన 'ది నేషన్' పత్రిక కూడా తాజాగా ఈ రోజు సంపాదకీయంలో షరీఫ్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. "అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్ ఏకాకి అవుతున్నా... మనకు ఏమాత్రం బాధ లేదు. పాకిస్థాన్ ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసే పనిని భారత్ సమర్థవంతంగా చేస్తోంది. కాని, దాన్ని అడ్డుకోవడంలో పాకిస్థాన్ మాత్రం తీవ్రంగా విఫలమవుతోంది" అంటూ వ్యాఖ్యానించింది. ఇప్పటికే సార్క్ సదస్సును బహిష్కరించిన భారత్... గోవాలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో కూడా పాకిస్థాన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిందని... ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ కన్నతల్లిలా పెంచి పోషిస్తోందని విమర్శించిందని తన కథనంలో ది నేషన్ తెలిపింది. ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటూ, పాకిస్థాన్ ను ఏకాకిని చేసే ప్రయత్నాన్ని భారత్ విజయవంతంగా కొనసాగిస్తోందని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ తన విధానాలను సమూలంగా మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని అభిప్రాయపడింది. జైష్-ఏ-మొహమ్మద్, జమాతుల్ దవా, లష్కరే తాయిబా వంటి ఉగ్రవాద సంస్థలను పాకిస్థాన్ మట్టుబెట్టాలని... ముంబై దాడుల మాస్టర్ బ్రెయిన్ హఫీజ్ సయీద్, పఠాన్ కోట్ దాడుల సూత్రధారి మసూద్ అజార్ లను వెంటనే అరెస్ట్ చేసి, ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు ఇవ్వడం లేదనే విషయాన్ని ప్రపంచానికి చాటాలని సూచించింది.

More Telugu News