: రోజుకు 550 ఉద్యోగాలు పోతున్నాయ్: తాజా అధ్యయనంలో వెల్లడైన పచ్చి నిజం

గడచిన నాలుగేళ్లుగా ఇండియాలో నిత్యమూ 550 ఉద్యోగాలు మాయమైపోతున్నాయని, ఇదే విధంగా కొనసాగితే, 2050 నాటికి 70 లక్షల ఉద్యోగాలు కనిపించకుండా పోతాయని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సివిల్ సొసైటీ గ్రూప్ ప్రహార్ వెల్లడించింది. ఇండియాలో రిటైల్ వెండార్లు, కాంట్రాక్టు కూలీలు, నిర్మాణ రంగ కార్మిక విభాగాల్లో ఉపాధిని పొందుతున్న వారికి ముందు ముందు గడ్డుకాలం దాపురించనుందని హెచ్చరించింది. లేబర్ బ్యూరో విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2015లో ఇండియాలో 1.35 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. 2011లో 9 లక్షల ఉద్యోగాలు, 2013లో 4.19 లక్షల ఉద్యోగ సృష్టి నమోదు కాగా, ఆ సంఖ్యతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇక ఈ గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే, ఒక రోజులో 550 ఉద్యోగాల చొప్పున మటుమాయం అవుతున్నాయని, భారత జనాభా మరో 60 కోట్లు పెరిగే వరకు, ఇప్పుడున్న ఉద్యోగాల్లో 70 లక్షల వరకూ తగ్గవచ్చని, ఇది ప్రమాద ఘంటికలను మోగిస్తున్నట్టుగా భావించాల్సి వుంటుందని ప్రహార్ హెచ్చరించింది. ఇండియాలో ఉద్యోగ సృష్టి నిదానంగా తగ్గుతోందని, ఆ మేరకు నిరుద్యోగం పెరుగుతోందని తెలిపింది. దేశంలోని మొత్తం ఉద్యోగాల్లో 50 శాతం వరకూ వ్యవసాయ రంగం అందిస్తుండగా, ఆపై చిన్న, మధ్య తరహా సంస్థల్లో 40 శాతం మంది ఉపాధిని పొందుతున్నారు. సంఘటిత రంగంలో కేవలం 3 కోట్ల ఉద్యోగాలు మాత్రమే లభిస్తున్నాయి. ఇదే సమయంలో అసంఘటిత రంగంలో 44 కోట్ల ఉద్యోగాలున్నాయి. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం, 1994లో వ్యవసాయ రంగంలో 60 శాతం మంది ఉపాధిని పొందుతుండగా, ఆ సంఖ్య 2013 నాటికి 50 శాతానికి తగ్గింది. అధికంగా ఉద్యోగాలను అందిస్తున్న ఎస్ఎంఈ రంగం మల్టీనేషన్ కంపెనీల రాకతో కుదేలయ్యే పరిస్థితి నెలకొందని ప్రహార్ హెచ్చరించింది. ఉద్యోగాల కల్పన కోసం భారత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన 'మేక్ ఇన్ ఇండియా' వారోత్సవాల్లో పలు మల్టీ నేషన్ కంపెనీల నుంచి దాదాపు 225 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించి, వచ్చే ఐదేళ్లలో క్షేత్రస్థాయి పనులు ప్రారంభం అవుతాయన్న అంచనాల నేపథ్యంలో, 60 లక్షల వరకూ కొత్త ఉద్యోగాలు రావచ్చని అంచనా వేసింది. ఇక దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగంతో పాటు ఎస్ఎంఈ కంపెనీలు తలెత్తుకు నిలిచే పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వాలు దృష్టి సారించాలని సూచించింది. ఇండియాకు స్మార్ట్ సిటీలకన్నా స్మార్ట్ విలేజ్ల అవసరం ఉందని అభిప్రాయపడింది.

More Telugu News