: ఒమర్ అబ్దుల్లాకు న్యూయార్క్ విమానాశ్రయంలో చేదు అనుభవం

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. న్యూయార్క్ యూనివర్సిటీలోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయనను, తనిఖీల పేరుతో న్యూయార్క్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు సుమారు రెండు గంటల పాటు వేచి ఉండేలా చేశారు. దీనిని ట్విట్టర్ ద్వారా తెలిపిన ఆయన అమెరికా వెళ్లిన ప్రతిసారి ఈ అనుభవం ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటిసారి తనిఖీలు పూర్తయినా, రెండోసారి తనిఖీల పేరుతో ఇలా ఇబ్బంది పెట్టడాన్ని ఆయన విమానాశ్రయం నుంచే ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. భద్రతా నియమాలను తాను కూడా గౌరవిస్తానని చెప్పిన ఆయన, తనిఖీల పేరుతో పదే పదే ఇలా చేయడం సరికాదని హితవు పలికారు. ఈ బాగోతంతో రెండు గంటలపాటు ఖాళీగా విమానాశ్రయంలో వేచి ఉండాల్సి వచ్చిందని ఆయన మండిపడ్డారు. గతంలో ఇలాంటి అనుభవం బాలీవుడ్ నటులు షారూఖ్, అక్షయ్ కుమార్, పలువురు రాజకీయనాయకులకు ఎదురైన సంగతి తెలిసిందే.

More Telugu News