: యూరీ సెక్టార్ లో ముష్కరులు సరిహద్దులు ఎలా దాటారంటే..!

యూరీ సెక్టార్ లో సెప్టెంబర్ 18న దాడికి పాల్పడి 19 మంది సైనికులను హతమార్చిన ముష్కరులు భారత్ లో ఎలా ప్రవేశించిందీ సైన్యం అంతర్గత నివేదికలో పేర్కొంది. పీవోకేలోని సలామాబాద్ నియంత్రణ రేఖ వద్ద కంచె తెగిపోయి చిన్న సందు ఉంది. ఇక్కడికి ఇద్దరు సహాయకులు, నిచ్చెనలతో సాయుధులైన నలుగురు ఉగ్రవాదులు చేరుకున్నారు. వారిలో ఒకతను ఆ సందుగుండా లోపలికి ప్రవేశించి, కంచెకు ఈవలివైపు ఒక నిచ్చెన వేశాడు. అవతలి వైపు నిచ్చెన వేసి దాని సహాయంతో కంచె పైకెక్కిన ముగ్గురు ఉగ్రవాదులు దానిపై రెండు నిచ్చెనలను వేసి వంతెనలా ఏర్పాటు చేసుకున్నారు. అంతకు ముందు సరిహద్దులు దాటిన ఉగ్రవాది వేసిన నిచ్చెన సాయంతో దర్జాగా దిగి లోపలికి ప్రవేశించారు. అనంతరం సహాయకులు ఆ నిచ్చెనలు వెనక్కి తీసుకెళ్లిపోయారు. సరిహద్దుల నుంచి గొహల్లన్ లేదా జబ్లా గ్రామాలకు వీరు సెప్టెంబర్ 16 లేదా 17న చేరుకుని ఉంటారని అంతర్గత దర్యాప్తు నివేదిక చెబుతోంది. ఆ గ్రామాల్లోని ఒక గ్రామంలో ఒకరోజు ఆశ్రయం పొంది ఉంటారని, అనంతరం అదును చూసుకుని, ఆర్మీ శిబిరంలోకి చొచ్చుకొచ్చి వంటగది, స్టోర్ రూంలకు బయటి నుంచి గడియపెట్టి దాడికి తెగబడ్డారని, సైనికులు ఇందులో దాక్కోకుండా ఉండేందుకు వారు ఈ విధంగా చేశారని ఆ అంతర్గత నివేదికలో పేర్కొన్నారు.

More Telugu News