: డిజిటల్‌ ఇండియాలో భాగంగా... రెండు వేల రైల్వే స్టేషన్లలో భారీ స్క్రీన్లు

రైల్వేల్లో భారీ సంస్కరణలకు తెరతీసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో అతిపెద్ద సంస్కరణను చేపట్టనుంది. ఇండియాలో రైల్వేలకు ఉన్న ఆదరణ మరే రవాణా వ్యవస్థకు లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రైళ్లు ఆలస్యంగా తిరిగినా వాటిపైనే ఆధారపడేవారు ఎంతో మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో సుమారు 2వేల రైల్వేస్టేషన్లలో భారీ స్క్రీన్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రైళ్ల రాకపోకలు, సీట్ల వివరాలు, ప్లాట్‌ ఫామ్‌ సమాచారం తదితరాలను ఈ జెయింట్ స్క్రీన్లపై ప్రదర్శించడం ద్వారా ఆదాయం సంపాదించడంపై రైల్వేశాఖ దృష్టిసారించింది. డిజిటల్‌ ఇండియాలో భాగంగా రైల్వే స్టేషన్ల ఆధునికీకరణపై దృష్టి పెట్టిన రైల్వే శాఖ, ఆధునిక సౌకర్యాలపై దృష్టిసారించింది. అందులో భాగంగా రైల్వే స్టేషన్లలో జెయింట్ స్క్రీన్లపై వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేస్తూ ప్రయాణికులకు సమాచారం చేరవేసే దిశగా చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు రైల్వేశాఖ ప్రయోగాత్మకంగా ఢిల్లీ, వారణాసి, గ్వాలియర్‌, జయపుర, గోరఖ్‌ పూర్‌ వంటి ఆరు రైల్వే స్టేషన్లలో తొలిదశలో జెయింట్ స్క్రీన్లు ఏర్పాటు చేయనుంది. అనంతరం దీనిని సుమారు 2 వేల రైల్వే స్టేషన్లలో అమలు చేయనున్నారు. ఇప్పటికే విశాఖపట్టణం వంటి రైల్వే స్టేషన్లలోకి అడుగుపెట్టే ప్రయాణికులను జెయింట్ స్క్రీన్లు ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News