: అవును! ఎన్టీఆర్, ఏఎన్నార్ ల మధ్య శత్రుత్వం ఉండేది... అది వృత్తిపరంగానే!: దాడి వీరభద్రరావు

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు ప్రముఖ నటుడు ఏఎన్నార్ తో శత్రుత్వం ఉండేదని, అయితే అది కేవలం వృత్తిపరమైనదే తప్ప వారి మధ్య మంచి సాన్నిహిత్యముండేదని సీనియర్ రాజకీయ నాయకుడు దాడి వీరభద్రరావు తెలిపారు. ఓ టీవీ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్, ఏఎన్నార్ అత్యంత సన్నిహితులని అన్నారు. ఏఎన్నార్ తల్లి ఎన్టీఆర్ ను పెద్దకొడుకు అని, ఏఎన్నార్ ను చిన్న కొడుకని పిలిచేవారని గుర్తుచేసుకున్నారు. 1994లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా సినీ పరిశ్రమ సన్మానించినప్పుడు ఏఎన్నార్ దానికి హాజరు కాలేదని గుర్తు చేసుకున్నారు. అప్పుడు సినిమాటోగ్రపీ మంత్రిగా వున్న తాను ఏఎన్నార్ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించి, మీరు రాకపోవడంతో ఎన్టీఆర్ బాధపడ్డారని కూడా చెప్పానని ఆయన అన్నారు. దానికి ఏఎన్నార్ 'అవునా, బాధపడ్డారా? సరే కలుద్దాం' అని అన్నారని తెలిపారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ కు... 'మీరు పిలవలేద'ని ఏఎన్నార్ ఆ కార్యక్రమానికి రాలేదన్నారని తాను చెప్పానని అన్నారు. వెంటనే ఫోన్ తీసుకున్న ఎన్టీఆర్... 'బ్రదర్ రేపు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మనం కలుస్తున్నాం' అని ఫోన్ పెట్టేశారని ఆయన తెలిపారు. మరుసటి రోజు బ్రేక్ ఫాస్ట్ సందర్భంగా కలుసుకున్న వారిద్దరూ...'బ్రదర్ మనం మద్రాసు వెళ్లినప్పుడు చెప్పులు లేకుండా నడిచిన రోజులు, సైకిల్ లేకుండా సుదూర ప్రయాణాలు చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయ'ని ఏఎన్నార్ అంటే... 'బ్రదర్ మీరు మర్చిపోయారు...నేను మద్రాసు వచ్చేసరికి మీకు చెప్పులున్నాయి, మీకు ర్యాలీ సైకిల్ ఉంది. ఆ తరువాతే నేను చెప్పులు కొనుక్కున్నా'నని సరిచేశారు. వారిద్దరి మధ్య భేషజాల్లేని అంతటి సాన్నిహిత్యం ఉండేదని ఆయన తెలిపారు.

More Telugu News