: మనం నిజాయతీగా సహకరించుకోవాలి: జిన్ పింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ నుంచి భారత్ ఉగ్రవాద వ్యతిరేక పోరులో ఐక్యత, అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌ సభ్యత్వానికి మద్దతును ఆశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మీడియాలో కథనాలు కూడా వెలువడ్డాయి. ఈ క్రమంలో బ్రిక్స్ సదస్సులో జిన్ పింగ్ ఏం మాట్లాడనున్నారా? అంటూ సర్వత్ర ఆసక్తి వ్యక్తమయింది. అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ, అసలు విషయాలను వదిలేసి బ్రిక్స్ ప్లీనరీలో మాట్లాడిన జిన్‌ పింగ్‌ 2014లో తాను భారత్‌ను సందర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. '2014లో నేను భారత్‌ వచ్చాను. ఈ గొప్ప దేశానికి చెందిన కష్టపడే ప్రజలు, రంగురంగుల సంస్కృతి నన్ను చాలా ముగ్ధుడ్ని చేశాయి' అన్నారు. బ్రిక్స్ సహకారం ప్రారంభమై పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలు బ్రిక్స్‌ దేశాలకు ఫలప్రదంగా మారాలని కోరుకుంటున్నానని అన్నారు. బ్రిక్స్ దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి. బ్రిక్స్‌ దేశాలమైన మనం మంచి స్నేహితులుగా, సోదరులుగా, భాగస్వాములుగా ఉండి ఒకరినొకరు నిజాయతీగా గౌరవించుకోవాలని ఆయన సూచించారు.

More Telugu News