: భారత సాఫ్ట్ వేర్ రంగం చచ్చిపోయింది: విదేశీ మీడియా

గడచిన రెండు దశాబ్దాలుగా శరవేగంగా విస్తరిస్తూ వచ్చిన భారత ఐటీ పరిశ్రమ నేడు చచ్చిపోయిందని విదేశీ మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ ఫలితాలను, ఆదాయ వృద్ధి తగ్గనుందన్న కంపెనీల అంచనాలను ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు వచ్చాయి. పదిహేడు సంవత్సరాల క్రితం భారతీయులు సమాచార సాంకేతికతను కొత్త పుంతలు తొక్కించారని, ప్రపంచాన్నే తమ వైపు తిప్పుకున్నారని, ఆపై ఎంతో అభివృద్ధి సాధించిన ఐటీ రంగం, ఇప్పుడు మాత్రం ప్రపంచ స్థాయి నాణ్యతను అందుకోలేక కూలబడిందని 'బ్లూమ్ బర్గ్' వార్తా సంస్థ అభిప్రాయపడింది. 'వై2కే' బగ్ నుంచి ప్రపంచంలోని కంప్యూటర్లను కాపాడిన హైదరాబాద్, బెంగళూరు టెక్కీలు ఇప్పుడు అంతే స్థాయిలో కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయలేకపోతున్నారని పేర్కొంది. వై2కే బగ్ పై విజయంతో ప్రారంభమైన భారత ఐటీ కంపెనీల ప్రాభవం సాలీనా రూ. 7.31 లక్షల కోట్ల వ్యాపారం చేసే స్థాయికి పెరిగి, గత వారాంతంలో చచ్చిపోయిందని కీలక వ్యాఖ్యలు చేసింది. భారత ఐటీ దిగ్గజం టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు ఆదాయం తగ్గుతాయని చెప్పడాన్ని ప్రస్తావిస్తూ, కంపెనీల ఆదాయం భవిష్యత్తులో మరింతగా తగ్గిపోనుందని అంచనా వేసింది. 2008లో లీమన్ బ్రదర్స్ దివాలా నాటికి ఇన్ఫోసిస్ ఆదాయ వృద్ధి సాలీనా 29 శాతం ఉందని గుర్తు చేస్తూ, ఇప్పుడది 10 శాతం కన్నా దిగువకు పతనమైందని పేర్కొంది. కొత్త డిజిటల్ ప్రపంచం ఏవైపు పరుగులు తీస్తోందో ముందుగానే గుర్తించడంలో భారత కంపెనీలు విఫలమవుతున్నాయని తెలిపింది. ఈ రంగంలో పరుగులు పెడుతున్న యాక్సెంచర్ తో పోలిస్తే, 1.5 రెట్ల అధిక ఉద్యోగులు ఉన్న టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు, కొత్త టెక్నాలజీ విభాగం నుంచి 40 శాతం తక్కువ ఆదాయాన్ని పొందుతున్నాయని, అంతర్జాతీయ స్థాయి క్లయింట్ల సంఖ్య ఈ కంపెనీలకు తగ్గుతోందని తెలిపింది. ఈ కథనం భారత ఐటీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

More Telugu News