: హిల్లరీపై ట్రంప్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు.. మాదకద్రవ్యాలు తీసుకుని డిబేట్‌కు వస్తున్నారని ఆరోపణ

అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(70) మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డిబేట్‌కు ముందు హిల్లరీ క్లింటన్(68) డ్రగ్స్ తీసుకుని వస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. వచ్చే వారం లాస్ వెగాస్‌లో జరగనున్న డిబేట్‌కు ముందు డ్రగ్ పరీక్షలకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు. అందుకు తాను సిద్ధమేనని పేర్కొన్నారు. గత డిబేట్ సందర్భంగా మొదట ఉత్సాహంగా మాట్లాడిన హిల్లరీ తర్వాత తన కారు దగ్గరకు వెళ్లేందుకు ఎంతో కష్టపడ్డారని అన్నారు. దీంతో ఆమె మాదక ద్రవ్యాలు తీసుకుని డిబేట్ కు వస్తున్నట్టు అనుమానించాల్సి వస్తోందని, వచ్చే వారం జరగనున్న చివరి డిబేట్‌కు ముందు అధ్యక్ష అభ్యర్థులకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించాలని సూచించారు. న్యూ హ్యాంప్‌షైర్‌లో తన మద్దతుదారులతో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘మేం అథ్లెట్ల వంటి వాళ్లం. ప్రైమరీల్లో 17 మందిని ఓడించా. పోటీలో పాల్గొనడానికి ముందు అథ్లెట్లు డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటారుగా. డిబేట్‌కు ముందు మేం కూడా చేయించుకోవాలి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆయన ప్రచారం మొత్తం హిల్లరీ ఆరోగ్యం నిలకడపైనే సాగింది. ఆమె అంత సత్తువగా ఉండడానికి డ్రగ్సే కారణమని ఆరోపించారు.

More Telugu News