: డబ్బు కోసం కన్న తండ్రినే కిడ్నాప్ చేసిన కొడుకు.. సినిమా కథను తలదన్నే రీతిలో డ్రామా!

సాధారణంగా ఇటువంటి కిడ్నాప్ సీన్లు సినిమాల్లో కనిపిస్తుంటాయి. ఆ ప్రభావమో ఏమో.. తండ్రి రిటైర్‌మెంట్ రూపేణా వచ్చిన డబ్బులను కొట్టేయాలని భావించిన ఓ కొడుకు ఏకంగా తండ్రినే కిడ్నాప్ చేయించాడు. విషయం బయటపడడంతో ఊచలు లెక్కపెట్టుకుంటున్నాడు. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో జరిగిందీ ఘటన. జిల్లాలోని తంగదౌన్‌కు చెందిన భగవత్ చంద్ర బెహరా ఉపాధ్యాయుడు. ఇటీవల ఆయన రిటైర్ కావడంతో ప్రభుత్వం నుంచి పెద్దమొత్తంలో బెనిఫిట్స్ వచ్చాయి. కుమార్తెల పెళ్లిళ్ల కోసం ఆయన ఆ సొమ్మును బ్యాంకులో భద్రపరిచారు. అయితే చెడు సావాసాలకు అలవాటు పడిన ఆయన కుమారుడు అబానీ బెహ్రా ఆ సొమ్మును కొట్టేసేందుకు ప్లాన్ వేశాడు. స్నేహితులతో కలిసి తండ్రిని కిడ్నాప్ చేయాలని భావించాడు. అనుకున్నట్టుగానే ఈనెల 10న బరిపడ నుంచి నుంచి ఇంటికి వస్తున్న తండ్రిని స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేయించాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన తండ్రి కిడ్నాపయ్యారని, దుండగులు రూ.7 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భగవత చంద్ర ఫోన్‌ను ట్రాక్ చేసిన పోలీసులు.. అది ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో ఉన్నట్టు చూపిస్తుండడంతో కిడ్నాపర్లు బాధితుడిని వివిధ ప్రాంతాలకు తిప్పుతున్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత కిడ్నాపర్లు డిమాండ్ చేసిన రూ.7 లక్షలను చెక్ రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈలోగా బాధితుడి ఏటీఎం కార్డును ఉపయోగించి రూ.80వేలు డ్రా చేసినట్టు గుర్తించిన పోలీసులు వెంటనే ఆయన కుమారుడు అబానీ బెహ్రాను పిలిచి ఏటీఎం, బ్యాంకు అకౌంట్‌ను బ్లాక్ చేయించాలని చెప్పారు. అయితే ఏటీఎంను బ్లాక్ చేసిన ఆయన అకౌంట్‌ను మాత్రం బ్లాక్ చేయించలేదు. దీంతో అతడిని అనుమానించిన పోలీసులు నిఘా ఉంచారు. అతడికి తెలియకుండా బ్యాంకు అకౌంట్‌ను బ్లాక్ చేయించారు. అయితే అప్పటికే చెక్ అందుకున్న నిందితులు దానిని క్యాష్ చేసుకునేందుకు బ్యాంకుకు వచ్చారు. బ్యాంకుకు వచ్చిన నిందితులు అబానీ బెహ్రాతో మాట్లాడడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో అతడిని అదుపులో తీసుకున్న పోలీసులు తమ శైలిలో ప్రశ్నించగా నిజం అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని కటకటాల వెనక్కి పంపారు.

More Telugu News