: జయలలిత ఆరోగ్యంపై వదంతలు.. చెక్ పెట్టేందుకు ఐటీ డెస్క్ ఏర్పాటు చేసిన పార్టీ నేతలు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై వెల్లువెత్తుతున్న వదంతులకు చెక్ పెట్టేందుకు అన్నాడీఎంకే నేతలు ప్రత్యేకంగా ఓ ఐటీ డెస్క్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జయలలిత మృతి చెంది చాలా రోజులు అయిందని కొందరు, ఆమె బతికే అవకాశాలు ఏమాత్రం లేవని మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండడంతో దృష్టిసారించిన పార్టీ వాటికి చెక్ పెట్టాలని భావించింది. సీఎం ఆరోగ్యంపై దుష్ప్రచారం చేస్తున్న వారిని కనిపెట్టి పోలీసులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా ఓ ఐటీ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. ‘అమ్మ’ ఆరోగ్యంపై వదంతులు సృష్టిస్తున్న వారిని గుర్తించి ఆ సమాచారాన్ని పోలీసులకు అందిస్తున్నారు. ఈ డెస్క్ 24 గంటల పాటు పనిచేస్తున్నట్టు నేతలు తెలిపారు. డెస్క్ ఇచ్చిన సమాచారంతో ఇప్పటికే వదంతులకు కారణమైన ఇద్దరు కెనరా బ్యాంకు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాక మరో 50 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారిపై చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇక విదేశాల్లో ఉన్న తమిళులు కూడా వదంతుల వ్యాప్తికి కారణమవుతున్నారని సైబర్ క్రైం విభాగం సీనియర్ అధికారులు పేర్కొన్నారు.

More Telugu News