: నిజంగానే ‘సరస్వతి’ నది ఉందని తేల్చిన వాల్దియా కమిటీ.. మళ్లీ జలకళ చూస్తామన్న ఉమా భారతి

త్రివేణీ సంగమం... ఈ పేరు చెప్పగానే స్ఫురించేది గంగా, యమునా, సరస్వతి. గంగా, యమునా నదులు అందరికీ తెలిసినవే. కానీ సరస్వతి... పురాణాల్లో తప్ప భూమిపై కనిపించదు. అంతర్వాహినిగా ప్రవహిస్తోందని నమ్మడం తప్ప. ఇక ఈ నది ఉన్నదా? లేదా? అన్న విషయమై కేంద్రం నియమించిన వాల్దియా కమిటీ, నది ఉందని తేల్చింది. ఈ మేరకు వాల్దియా కమిటీ నివేదికను కేంద్ర జలవనరుల శాఖకు ఇవ్వగా, త్వరలో అది క్యాబినెట్ ముందుకు రానుంది. ఈ నది ఒకప్పుడు ప్రవహించి, తరువాత ప్రకృతి మార్పుల కారణంగా దిశను మార్చుకున్న వేళ, వట్టిగా మిలిగిపోయిన ప్రాంతాల కింద భారీగా స్వచ్ఛమైన నీరుందని, దాన్ని వెలికితీస్తే, కరవు ప్రాంతాల దాహం తీరుతుందని కేఎస్ వాల్దియా తన పరిశోధన గురించిన వివరాలు తెలిపారు. హిమాలయాల్లో పుట్టి, గుజరాత్ లోని గల్ఫ్ ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలిసే నది, దాదాపు 4 వేల కిలోమీటర్ల దూరం పారిందని, పాక్ లోని రాన్ ఆఫ్ కచ్ ప్రాంతం గుండానూ ప్రవహించిందని తెలిపారు. హరప్పా నాగరికత కాలంలో 5,500 సంవత్సరాల పాటు పాలియోచానెల్ తీరంగా 1,700 వరకూ చిన్న, పెద్ద గ్రామాలు ఉన్నాయని, నీరు లేకుండా ప్రజలు అంతకాలం పాటు మనుగడ సాగించలేరు కాబట్టి, ఓ నది వారికి జీవనాధారంగా నిలిచివుండవచ్చన్న అంచనాలతో పరిశోధనలు సాగించగా, అది సరస్వతీ నదేనని గుర్తించినట్టు వాల్దియా తెలిపారు. ఇక కృత్రిమ పద్ధతుల్లో నదిలో నీటిని తిరిగి పారించే అంశాన్ని పరిశీలించనున్నట్టు కేంద్ర మంత్రి ఉమాభారతి పేర్కొన్నారు. అందుకోసం సమగ్ర ప్రణాళిక రూపొందించనున్నట్టు తెలిపారు.

More Telugu News