: ఇక పోస్టాఫీసుల్లో పప్పుదినుసులు.. సబ్సిడీ రేట్లకు అందించాలని కేంద్రం నిర్ణయం

ఇప్పటికే గంగాజలాన్ని అందిస్తున్న పోస్టాఫీసులు ఇక నుంచి చవక ధరల దుకాణాలుగా మారిపోనున్నాయి. పోస్టుఫీసుల్లో రాయితీపై పప్పు దినుసులను అందించాలని కేంద్రం నిర్ణయించింది. మరో రెండు వారాల్లోనే ఈ ప్రయోగాత్మక పథకాన్ని ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ విషయంపై ఇప్పటికే పోస్టల్ డిపార్ట్‌మెంట్‌తో మాట్లాడామని, వారు అంగీకరించారని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి హేమ్ పాండే తెలిపారు. శనగపప్పు రేటు ప్రస్తుతం ఆకాశాన్నంటుతుండడంతో తొలుత పోస్టాఫీసుల ద్వారా రాయితీపై శనగపప్పు అందిస్తామని పేర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ ఔట్‌లెట్లు లేకపోవడంతో ప్రజలకు నిత్యావసరాలు అందడం లేదని, పోస్టాఫీసులు ప్రతీ గ్రామంలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు హేమ్‌పాండే వివరించారు. మరికొన్ని రోజుల్లోనే పప్పుల ప్యాకెట్లను పోస్టాఫీసుల నుంచి ప్రజలు కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

More Telugu News