: మురికివాడల్లో బహుళ అంతస్తులు.. ఉద్యమ స్ఫూర్తితో స్వచ్ఛ ఏపీ: చంద్రబాబు

రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం తిరుపతిలో పర్యటించిన చంద్రబాబు పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి పారిశుద్ధ్య పరిస్థితులను కళ్లారా చూశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాబు.. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకోసం ప్రతి శనివారం పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని అన్నారు. ప్రజలు ఈ విషయంలో విజ్ఞతతో ఆలోచించి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాకారానికి సహకరించాలని కోరారు. ప్రజల్లో బాధ్యత పెంచేందుకు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసేవారికి జరిమానా విధించనున్నట్టు తెలిపారు. తిరుపతి, అమరావతి, విశాఖ నగరాలను మెగాసిటీలుగా అభివృద్ధి చేస్తామన్నారు. మరో 73 పట్టణాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. పల్లెలను పట్టణాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. వాస్తవాలు తెలుసుకునేందుకే ఆకస్మిక పర్యటనలు చేస్తున్నట్టు వివరించారు. 15 నెలల్లో తిరుపతిలో చెత్తనుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంటును ప్రారంభిస్తామన్నారు. మురికవాడల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి ఇవ్వనున్నట్టు చంద్రబాబు తెలిపారు.

More Telugu News