: పంజాబ్‌లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్‌ పరం?.. ఇండియా టుడే-యాక్సిస్ ఒపీనియన్‌ పోల్‌లో వెల్లడి

వ‌చ్చే ఏడాది ఆరంభంలో జ‌ర‌గ‌నున్న పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ బ‌లం ఎంత? అనే అంశంపై ఇండియా టుడే - యాక్సిస్ ఒపీనియన్‌ పోల్ నిర్వ‌హించింది. స‌ర్వే ఆధారంగా శిరోమణి అకాళీదళ్‌-బీజేపీ కూటమికి ఈ సారి ఓట‌మి త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. పంజాబ్‌లో త‌దుప‌రి ప్ర‌భుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్ప‌రుస్తుంద‌ని స‌ర్వే చెబుతోంది. అకాళీదళ్‌-బీజేపీ కూట‌మికి రెండో స్థానం కూడా ద‌క్క‌ద‌ని పేర్కొంది. ఇక ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రాష్ట్రంలో రెండో స్థానంలో నిల‌వ‌నుంద‌ని తెలుస్తోంది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు స‌ర్వే తెలిపింది. 117 సీట్లు ఉన్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో 33 శాతం ఓట్లు రాబట్టుకునే కాంగ్రెస్‌ పార్టీకి 49 నుంచి 55 సీట్లు వస్తాయ‌ని, ఆమ్ ఆద్మీ పార్టీ 30 శాతం ఓట్ల‌తో 42 నుంచి 46 సీట్లు గెలుచుకుంటుందని సర్వేలో పేర్కొన్నారు. ఇక ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న శిరోమణి అకాళీదళ్‌-బీజేపీ కూటమి ఈ సారి 17 నుంచి 21 సీట్లు మాత్ర‌మే గెలుచుకుంటుంద‌ని తెలుస్తోంది. ఇత‌ర పార్టీల‌కు 3 నుంచి 7 సీట్లు వచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌ర్వేలో వెల్ల‌డైంది. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఆ రాష్ట్రంలో పార్టీ క‌నీసం 59 సీట్ల‌ను గెలుపొందాలి. కాంగ్రెస్‌ 49 నుంచి 55 సీట్లు సాధించినా కూడా ఇత‌ర పార్టీల స‌హ‌కారం కావాల్సి ఉంటుంది. డ్ర‌గ్స్‌ స్మగ్లింగ్‌, అవినీతి లాంటి ఆరోపణల‌తో ఆ రాష్ట్ర అధికార పార్టీ దెబ్బ‌తిన‌క‌త‌ప్ప‌ద‌ని పేర్కొంది. పంజాబ్‌లో కాంగ్రెస్‌ గెలుపొందితే 2002 నుంచి 2007లో సీఎంగా ప‌నిచేసిన‌ అమరీందర్‌ సింగ్ మ‌ళ్లీ ఆ బాధ్య‌త‌లు స్వీక‌రించే అవకాశముందని తెలిపింది.

More Telugu News