: భార‌త్‌, పాక్ మ‌ధ్య వెంటనే చ‌ర్చ‌లు జ‌ర‌గాలి: నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేత ఫ‌రూఖ్ అబ్దుల్లా

భార‌త్‌, పాక్ మ‌ధ్య వెంట‌నే చ‌ర్చ‌లు జ‌ర‌గాలని నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేత ఫ‌రూఖ్ అబ్దుల్లా అన్నారు. ఈ రోజు ఆయ‌న శ్రీనగర్ లో మీడియాతో మాట్లాడుతూ... తాము శాంతిని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఉద్రిక్త‌త‌ల‌ను నివారించేందుకు చ‌ర్చ‌లే ప‌రిష్కార‌మ‌ని వ్యాఖ్యానించారు. అల్ల‌ర్ల కార‌ణంగా అదుపులోకి తీసుకున్న కశ్మీర్ వేర్పాటు వాదులను వెంట‌నే వ‌దిలేయాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. అయితే, పాక్ ఉగ్ర‌వాదులు ఇటీవ‌ల చేసిన యూరీ దాడి ఘటనపై తాను మాట్లాడబోనని ఆయ‌న అన్నారు. పీవోకేలోకి ప్ర‌వేశించి భార‌త్ జరిపిన ల‌క్షిత దాడుల‌ గురించి కూడా తాను ఇప్పుడు మాట్లాడబోనని చెప్పారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, జ‌మ్ముక‌శ్మీర్‌లో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొల్పేందుకు కృషి చేయాల‌ని ఫ‌రూఖ్ అబ్దుల్లా కోరారు. రాష్ట్రంలో జ‌రుగుతోన్న‌ ఆందోళనలతో జనజీవనం అస్త‌వ్య‌స్త‌మ‌యింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అక్క‌డి సమస్యల‌కు పరిష్కారం చూపాల‌ని అన్నారు. ఉగ్రవాది బుర్హాన్ వనీని భార‌త‌సైన్యం హతమార్చాక రాష్ట్రంలో మూడున్నర నెలలుగా జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింద‌ని ఆయ‌న చెప్పారు. విభజన రాజకీయాలు తమకు ఇష్టం లేదని ఆయ‌న పేర్కొన్నారు. భారత్ ఎన్నో మ‌తాలు, వ‌ర్గాలు ఉన్నాయ‌ని వాట‌న్నింటిని కాపాడాలని, రాజ్యాంగాన్ని కేంద్రం ర‌క్షించాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

More Telugu News