: ఆత్మరక్షణ కోసమే యెమెన్ పై మిసైల్ దాడి చేశాం: అమెరికా

ఎర్ర సముద్రంపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోన్న అమెరికా తాజాగా యుద్ధ నౌకలతో యెమెన్ పై దాడులు జరిపింది. ఆ దేశంలో రాడార్ నిర్వహణ స్థలాలపై ఈ దాడులకు దిగింది. దీనిపై స్పందించిన అమెరికా తాము జ‌రిపి దాడుల్లో మూడు రాడార్ నిర్వహణ కేంద్రాలు ధ్వంసం అయిన‌ట్లు తెలిపింది. అయితే, తాము జ‌రిపిన మిసైల్ దాడి ఆత్మరక్షణ కోసమేనని పేర్కొంది. యెమెన్ రాజధాని సానాతో పాటు మైనారిటీ షియా హౌథీ నియంత్రణలోని భూ భాగంపై త‌మ దేశ యుద్ధ‌నౌక‌ల‌తో దాడులు జ‌రిపిన‌ట్లు అమెరికా ర‌క్ష‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. గత ఆదివారం ఎర్ర సముద్రంపై ఉన్న త‌మ దేశ‌ యుద్ధనౌక యూఎస్ఎస్ మాసన్ పై యెమెన్ దాడి చేసిన‌ట్లు అమెరికా పేర్కొంది. అయితే, యెమెన్ నుంచి రెండు క్షిపణులు త‌మ యుద్ధ‌ నౌకను ధ్వంసం చేయ‌కుండా నీళ్లలో పడిపోయాయని పేర్కొంది. మూడు రోజుల క్రితం కూడా ఇదే తీరులో యుద్ధ‌నౌక‌పై యెమెన్ క్షిప‌ణి వ‌చ్చింద‌ని చెప్పింది. ఈ నేప‌థ్యంలోనే తాము యెమెన్ పై దాడులు చేయాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది. మ‌రోవైపు, అమెరికా చెబుతున్న కార‌ణాలను మైనారిటీ షియా హౌథీస్ ఖండించింది. అమెరికా యుద్ధ నౌకపై తాము దాడులు చేశారన్న ఆరోపణలు నిజం కాద‌ని చెప్పింది. ఈ నేప‌థ్యం ఆ ప్రాంతంలో యెమెన్ స్పంద‌న ఎలా ఉంటుందోన‌న్న ఆందోళ‌న నెల‌కొంది. ఇప్ప‌టికే సౌదీ అరేబియా నుంచి జ‌రుపుతున్న దాడుల‌ను యెమెన్ ఎదుర్కొంటోంది. సౌదీ అరేబియాకు అమెరికా నుంచి ఆయుధాలు అందుతున్నాయి.

More Telugu News