: చైనా వస్తువులను బాయ్‌కాట్ చేస్తారా.. ఏం పర్వాలేదు: భారత్ సోషల్ మీడియా పిలుపుపై చైనా స్పందన

చైనా వస్తువులను బాయ్‌కాట్ చేయాలంటూ భారత సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ప్రచారంపై చైనా స్పందించింది. ఆ ప్రచారం వల్ల భారత్‌లో పెరుగుతున్న తమ అమ్మకాలపైనా, ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలపైన కానీ ఎటువంటి ప్రభావం పడదని ఆ దేశ మీడియా పేర్కొంది. చైనా వస్తువులను నిషేధించాలని భారత ప్రభుత్వం ఎప్పుడూ పేర్కొనలేదని, దేశంలోని మారుమూల కూడా తమ వస్తువులు పాప్యులర్ అయ్యాయని కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన అధికారిక పీపుల్స్ డైలీ పేర్కొంది. బాయ్‌కాట్ పిలుపు విజయవంతం కాదని దక్షిణాసియా-పశ్చిమ చైనా కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్‌కు చెందిన స్కాలర్ ఝెన్ బో పేర్కొన్నారు. భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యేవి చైనా వస్తువులేనని పేర్కొన్నారు. అక్టోబరు మొదటి వారంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి ఈ-కామర్స్ సంస్థల ద్వారా అత్యధికంగా అమ్ముడుపోయినవి చైనా వస్తువులేనని తెలిపారు. ఇక షియోమీ అయితే మూడు రోజుల్లోనే ఈ మాధ్యమాల ద్వారా ఏకంగా 5 లక్షల ఫోన్లు విక్రయించినట్టు గుర్తు చేశారు. 2014తో పోలిస్తే 2015లో భారత్‌లో చైనా పెట్టుబడులు ఆరు రెట్లు పెరిగాయని, మొత్తంగా 870 మిలియన్ డాలర్లను చైనా పెట్టుబడులు పెట్టిందని పేర్కొన్నారు. ప్రాంతీయ విభేదాలు రచ్చకెక్కినప్పుడల్లా చైనా వస్తువులే బాధితులుగా మిగులుతున్నాయని పీపుల్స్ డైలీ ఆవేదన వ్యక్తం చేసింది. ఏది ఏమైనా సోషల్ మీడియా బాయ్‌కాట్ పిలుపుతో తమకు వచ్చే నష్టమేమీ లేదని పేర్కొంది. కాగా ఇటీవల చైనా వస్తువులతోపాటు ఆ దేశంలో తయారయ్యే బాణసంచాను కూడా బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

More Telugu News