: మరో వివాదానికి కేంద్ర బిందువైన జేఎన్ యూ

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. గతంలో హఫీజ్ సయీద్ కు జైకొట్టారంటూ వామపక్ష విద్యార్థి సంఘ నేత కన్నయ్య కుమార్ పై దేశద్రోహం కేసు నమోదు చేయడంతో అప్పట్లో జేఎన్యూ వార్తల్లో నిలిచింది. తాజాగా, ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, యోగా గురువు బాబా రాందేవ్, బీజేపీ ఎంపీ సాధ్వీ, రేప్ కేసు నిందిత ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు, గాంధీని చంపిన నాథురాం గాడ్సే, జేఎన్‌యూ ఉపకులపతి జగదీష్ కుమార్‌ తదితరులను రావణులుగా చిత్రీకరిస్తూ తయారు చేసిన దిష్టి బొమ్మను దసరా రోజున జేఎన్యూ ప్రాంగణంలో కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ తగులబెట్టింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దాలను నిలుపుకోవడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, విద్యా సంస్థలపై వరుస దాడులకు వ్యతిరేకంగా తమ నిరసనను ఇలా వ్యక్తం చేశామని విద్యార్థులు స్పష్టం చేస్తుండగా, ఎన్ఎస్యూఐ తెలిపిన నిరసనకు అనుమతి లేదని యూనివర్సిటీ చెబుతోంది. కాగా, యూనివర్సిటీలో నిరసనలు, దిష్టి బొమ్మలు తగులబెట్టడాలు సర్వసాధారణమని, వాటికి ఎవరి అనుమతి అవసరం లేదని, ఇంతవరకు ఎవరూ అనుమతి తీసుకుని నిరసన కార్యక్రమాలు తెలపలేదని వారు చెబుతున్నారు. కాగా, వారం క్రితం గుజరాత్ ప్రభుత్వం, గోరక్షకుల దిష్టిబొమ్మలను దహనం చేసినందుకు సంబంధిత విద్యార్థులకు వర్సిటీ షోకాజ్ నోటీసులు జారీచేసింది.

More Telugu News