: బామ్మ క్షేమ సమాచారం కోసం ఆరాటపడిన మనవడి కథ!

ఆప్యాయత, అనురాగాలు, బంధాలను కొలిచే కొలమానాలు ఇంకా రాలేదు. తాత, బామ్మ అందించే ప్రేమ ప్రతి మనవడికి చిరకాలం గుర్తుంటుంది. అలాంటి ఆప్యాయత పంచిన బామ్మ కోసం ఓ మనవడు తపన పడి పిజ్జా ఆర్డర్ చేశాడు. ఆ ఘటన వివరాల్లోకి వెళితే... అమెరికాను మాథ్యూ హరికేన్ వణికించిన సంగతి తెలిసిందే. హరికేన్ హెచ్చరికలతో ఫ్లోరిడాలోని పామ్‌ కోస్ట్‌లో ఉంటున్న 87 ఏళ్ల బామ్మ గురించి నెబ్రెస్కా స్టేట్‌ లో నివాసం ఉంటున్న ఎరిక్‌ ఓల్సెన్‌ కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. పెనుగాలులు, భారీ వర్షాలు, కరెంటు కోతలు, ఫోన్‌ లైన్లు కట్‌ కావడంతో ఆమె క్షేమసమాచారం తెలుసుకునే అవకాశం వారికి లేకపోయింది. దీంతో బామ్మ నుంచి ఫోన్‌ వస్తుందేమోనని ఎదురుచూశారు. ఆమె ఫోన్ చెయ్యలేదు. దీంతో ఎరిక్‌ ఓల్సెన్‌ తన బామ్మ ఉండే ప్రాంతంలో స్థానిక పోలీసులను ఫేస్‌ బుక్‌ ద్వారా సహాయం కోరారు. వారు కూడా స్పందించలేదు. వారికి కూడా సిగ్నల్స్ లేవు. దీంతో ఆమెను ఎలాగైనా కాంటాక్ట్ చేయాలని భావించిన ఎరిక్‌ కు 'పిజ్జా ఆర్డర్‌' ఐడియా వచ్చింది. ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా... 'పాపా జాన్స్‌' పిజ్జాకు ఫోన్‌ చేసి ఆర్డర్ ఇచ్చాడు. అలాగే ఆర్డర్ డెలివరీ సమయంలో తన మొబైల్ కు ఫోన్ చేయాలని సూచించాడు. దీంతో పిజ్జా డెలివరీ బాయ్‌ ఎరిక్ బామ్మ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఎరిక్‌ కు ఫోన్‌ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన ఎరిక్‌ చాలా ఆత్రుతగా బామ్మ ఇంట్లో క్షేమంగా ఉందా? అని అడిగాడు. 'ఏమో' అంటూ డెలివరీ బాయ్ కాలింగ్ బెల్ నొక్కగా, ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఎరిక్ ఉత్కంఠ పెరిగినంతలో లోపలి నుంచి 'ఎవరు?' అంటూ ప్రశ్న వినిపించింది. తాను పిజ్జా డెలివరీ బాయ్‌ నని, ఆమె కోసం పిజ్జాతెచ్చానని తెలిపాడు. అతను దోపిడీదారు అని అనుమానించిన బామ్మ, తాను పిజ్జా ఆర్డర్‌ చెయ్యలేదని లోపలి నుంచే చెప్పింది. దీంతో మీ క్షేమ సమాచారం తెలుసుకునేందుకు మీ మనవడు పిజ్జా ఆర్డర్ చేశాడని, కావాలంటే ఫోన్ లో మాట్లాడండని ఫోన్ ఇచ్చాడు. దీంతో మనవడితో మాట్లాడన ఆమె డెలివరీ బాయ్ ను లోపలికి రానిచ్చి సంతోషంగా కుటుంబ సభ్యులతో మాట్లాడింది. రెండ్రోజులైనా మాట్లాడడం కుదరకపోవడంతో ఇలా పిజ్జా ఆర్డర్‌ చేశానని మనవడు చెప్పగానే ఉప్పొంగిపోయిన బామ్మ, మవనడు పాపా జాన్ పిజ్జా కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు.

More Telugu News