: మోదీపై విరుచుకుపడ్డ ముస్లిం పర్సనల్ లా బోర్డు.. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు!

ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతోంది. ముస్లిం ప్రజల్లోని ట్రిపుల్‌ తలాక్‌, బహుభార్యత్వం వంటి సంప్రదాయాలను తాము వ్యతిరేకిస్తున్నామని, రాజ్యాంగం మౌలిక లక్షణమైన లింగ సమానత్వం విషయంలో ఎలాంటి సంప్రదింపులకు తావులేదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ చట్టాన్ని రద్దుచేసి, దాని స్థానంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆరోపించింది. దేశంలోని విభిన్న సంస్కృతులను ధ్వంసం చేయడానికి ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించింది. ట్రిపుల్ తలాక్ ను రద్దుచేయాలంటూ పలువురు ముస్లిం మహిళలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) విషయంలో ప్రజాభిప్రాయాన్ని కోరుతూ కేంద్ర న్యాయశాఖ ప్రశ్నావళిని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ ప్రశ్నావళిని ముస్లిం పర్సనల్ లా బోర్డ్‌ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. దేశంలోని బహుళ సంస్కృతిని గౌరవించాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రభుత్వానికి హితవు పలికింది. మోదీ దేశంలో అంతర్యుద్ధం సృష్టించాలని భావిస్తున్నారని ఆరోపిస్తూ, ముస్లింలంతా దీనిపై స్పందిస్తారని హెచ్చరించింది. భారత్‌ లో ఒకే భావజాలాన్ని రుద్దలేరని ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసింది. ఇస్లామిక్‌ చట్టమైన షరియా ప్రకారం ఒక ముస్లిం వ్యక్తి తన భార్యకు మూడుసార్లు 'తలాక్‌' అని చెప్పడం ద్వారా విడాకులు ఇవ్వొచ్చు. దీనిని ఉపయోగించుకుని కొంత మంది సోషల్ మీడియా, ఈమెయిల్, స్మార్ట్ ఫోన్ వంటి సాధనాల ద్వారా మూడు సార్లు తలాక్ అని చెబుతున్నారు. దీనికి తోడు ముస్లిం వ్యక్తి నలుగురు భార్యలను కలిగి ఉండవచ్చు. దీనిని ముస్లిం మహిళలు వ్యతిరేకిస్తున్నారు. స్త్రీల పట్ల వివక్ష చూపే ఈ విధానాలు రద్దు చేసి, ఐపీసీని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వివాదాస్పద అంశాలపై తొలిసారి కేంద్రం తన వైఖరిని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉమ్మడి పౌరస్మృతిపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ ఒక ప్రశ్నావళిని రూపొందించింది. దీనిని ముస్లిం మతపెద్దలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ట్రిపుల్ తలాక్‌, బహుభార్యత్వం ఉండాల్సిందేనని స్పష్టం చేస్తూ, ఉమ్మడి పౌరస్మృతి ప్రమాదకరమని ఆరోపణలు గుప్పిస్తున్నారు.

More Telugu News