: చంద్రబాబు పబ్లిసిటీ వల్లే విశాఖకు ఎక్కువ నష్టం వాటిల్లింది: గుడివాడ అమరనాథ్

విశాఖపట్టణానికి హుద్ హుద్ తుపాను కంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పబ్లిసిటీ వల్లే ఎక్కువ నష్టం వాటిల్లిందని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్ ఆరోపించారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, హుద్ హుద్ తుపాను సంభవించి నేటికి రెండేళ్లు ముగిసినా పట్టణ ప్రజలకు ఎలాంటి సహాయం చేయలేదని అన్నారు. నేటికి ఒక్కరికి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. ఆ తుపాను వల్ల లక్ష కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రధాని మోదీకి చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. దీంతో వెయ్యి కోట్ల ఇస్తానన్న ప్రధాని కేవలం 480 కోట్ల రూపాయలే ఇచ్చారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసరాల కోసం 450 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పిందని, ప్రపంచ స్థాయిలో సేకరించిన నిధుల్లో ఒక్క పైసా కూడా పట్టణానికి ఖర్చు చేయలేదని ఆయన ఆరోపించారు. ప్రచార వ్యామోహంతో హుద్ హుద్ ను గెలిచామని, ప్రకృతిని జయించిన వీరుడిలా చంద్రబాబు ప్రకటన చేయడాన్ని ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. హుద్ హుద్ కంటే చంద్రబాబు ప్రచారం వల్లే వైజాగ్ కు ఎక్కువ నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు. చంద్రబాబు వల్లే విశాఖకు పెట్టుబడులు రావడం లేదని ఆయన ఆరోపించారు.

More Telugu News