: ధోనీ, అజార్ అయిపోయారు... ఇప్పుడు తెరపైకి యువీ?

అగ్రశ్రేణి క్రీడాకారులు, సినీ ప్రముఖుల పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు జనాలకు చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. వారి వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి చాలా ఆసక్తిని కనబరుస్తుంటారు. దీన్ని కనిబెట్టిన బాలీవుడ్... క్రీడాకారుల జీవిత చరిత్రలతో సినిమాలు తీసి, కాసుల పంట పండించుకుంది. ఇప్పటికే ప్రముఖ క్రికెటర్లు ధోనీ, అజారుద్దీన్, మహిళా బాక్సర్ మేరీకోమ్ ల జీవిత చరిత్రలు సిల్వర్ స్క్రీన్ పై అదరగొట్టాయి. బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. దీంతో, ఈ తరహా సినిమాలను మరిన్ని నిర్మించే యోచనలో బాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు అడుగులు వేస్తున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బయోపిక్ కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోందో అన్న చర్చలు అప్పుడే మొదలయ్యాయి కూడా. ఈ నేపథ్యంలో, క్రీడాకారుల బయోపిక్ లపై బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ స్పందించాడు. బాలీవుడ్ లో వస్తున్న బయోపిక్ లన్నీ చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని... వ్యక్తిగతంగా తనకు యువరాజ్ సింగ్ జీవితకథ చాలా ఆసక్తిదాయకంగా ఉంటుందని చెప్పాడు. అతని జీవితంలో ఎన్నో విషయాలు ఉన్నాయని.. ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్న క్రీడాకారుడు యువీ అని... అతని జీవితకథతో సినిమా నిర్మిస్తే చాలా ఇన్ స్పైరింగ్ గా ఉంటుందని తెలిపాడు. మరోవైపు, దర్శక నిర్మాతలు ముందుకొస్తే యువీ పాత్రలో నటించేందుకు అభిషేక్ సిద్ధంగా ఉన్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది.

More Telugu News