: వెలగపూడిలో సీటెక్కిన చంద్రబాబు... డ్వాక్రా మహిళల రుణమాఫీపై తొలి సంతకం

నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన వెలగపూడిలో కొత్తగా నిర్మించిన తాత్కాలిక సచివాలయంలోని తన చాంబర్ లోకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రవేశించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సచివాలయ ఉద్యోగులు ఆయనకు శుభాకంక్షలు తెలిపారు. తన చాంబర్ లోని సీటులో కూర్చున్న అనంతరం డ్యాష్ బోర్డు ద్వారా ప్రాజెక్టుల్లో నీటి పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన, ఆపై పెండింగ్ లో ఉన్న డ్వాక్రా మహిళల రుణమాఫీ ఫైల్ పై సంతకం చేశారు. సీఎం వెంట చిన రాజప్ప, నారాయణ, కొల్లు రవీంద్ర, చీఫ్ సెక్రటరీ టక్కర్‌, డీజీపీ సాంబశివరావు, ఉన్నతాధికారులు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజధాని ప్రాంత రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఇకపై పాలన అమరావతి కేంద్రంగానే సాగుతుందని తెలిపారు. హైదరాబాద్ లో పదేళ్ల పాటు ఉండే హక్కు ఉన్నప్పటికీ, పాలన మన నేలపై నుంచి మాత్రమే సాగాలన్న ఉద్దేశంతో వేగంగా భవనాల నిర్మాణాలు సాగించినట్టు వెల్లడించారు. డ్వాక్రా మహిళలకు రెండో విడత పెట్టుబడి రాయితీల కింద రూ. 2,500 కోట్లు విడుదల చేస్తున్నట్టు చంద్రబాబు తెలియజేశారు. అభివృద్ధిని చూసి కొంతమంది అసూయ పడుతున్నారని, వారు చేసే విమర్శలను పట్టించుకోనవసరం లేదని అన్నారు.

More Telugu News